కౌంటింగ్‌ నిర్వహణ విజయవంతం

ఎన్నికల షెడ్యూల్‌

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • సమన్వయం, సమిష్టి కృషితోనే సాధ్యం
  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పట్నుంచీ కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో పలు శాఖల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. కౌంటింగ్‌ ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయం, సమిష్టి కృషితోనే ఎన్నికల నిర్వహణ విజయవంతమైందన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల నిర్వహణపై మంచి పరిజ్ఞానం ఉన్న బృందం తనకు లభించిందని తెలిపారు. ఆరు నెలలుగా బిఎల్‌ఒలు ఇంటి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించారన్నారు. పోలింగ్‌ తర్వాత కౌంటింగ్‌ కూడా డిబ్రీఫింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. బిఎల్‌ఒ, మండలం, డివిజన్‌, జిల్లా స్థాయి అందరు అధికారుల, పోలీస్‌ అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందని చెప్పారు. ఈ ప్రక్రియలో జాయింట్‌ కలెక్టర్‌, డిఆర్‌ఒ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ప్రతి అధికారి నిష్పక్షపాతం, నిబద్ధతతో విధులు నిర్వహించారన్నారు. కౌంటింగ్‌ విజయవంతం చేయడంలో, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా అడ్డుకట్ట వేయడంలో ఎస్‌పి కీలక బాధ్యతలు పోషించారని కొనియాడారు. సబ్‌ కలెక్టర్‌, ఆర్‌ఒలు చేసిన కృషి, నాలుగు నెలలుగా నోడల్‌ అధికారులు అంకితభావం చేపట్టిన విధులు ఇవన్నీ పోలింగ్‌, కౌంటింగ్‌ పూర్తి విజయవంతం చేయడానికి సహకరించాయన్నారు. ఎన్నికల కమిషన్‌ విధివిధానాలు ప్రతిఒక్కరూ దృష్టిసారించి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ పోలింగ్‌, కౌంటింగ్‌లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సమన్వయంతో పనిచేసి విజయానికి ప్రతిఒక్కరూ ముందుకు వచ్చారన్నారు. శిక్షణా తరగతుల్లో అందరు సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. శిక్షణా తరగతులు అందరికీ ఊయోగపడ్డాయన్నారు. నిర్దేశించిన పనులు ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయడం ఈ విజయానికి కారణమన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేసిన సంబంధిత నోడల్‌ అధికారులను ప్రశంసించారు.కౌంటింగ్‌ నిర్వహణలో పలు అధికారులు వారి అనుభవాలను పంచుకున్నారు. కొన్ని సందర్భాల్లో కష్టమైనా తాజా ఫలితం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. చిన్న చిన్న అంశాల్లో సైతం కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించిన విషయాలు క్షేత్రస్థాయిలో తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. ఉదయం ఐదు నుంచి రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్న కలెక్టర్‌ వ్యవహరించిన విధానాన్ని, సున్నితమైన అంశాలపై ఆయన స్పందించిన తీరును పలువురు నోడల్‌ అధికారులు కొనియాడారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, జెడ్‌పి సిఇఒ వెంకటేశ్వరరావు, రిటర్నింగ్‌ అధికారులు సుదర్శన్‌ దొర, భరత్‌నాయక్‌, అప్పారావు, సిహెచ్‌.రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహనరావు, నోడల్‌ అధికారులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

➡️