మహిళల అభివృద్ధికే ‘సూపర్‌ సిక్స్‌’

ఇంటి ఆర్థిక పరిస్థితులను

రామ్మోహన్‌ నాయుడు, శంకర్‌ను గెలిపించాలని కోరుతున్న చంద్రబాబు

  • జగన్‌కు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి

*  జిల్లా అభివృద్ధి బాధ్యత తీసుకుంటా

  • టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఇంటి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టే ప్రతి మహిళకు మేలు చేకూర్చేలా సూపర్‌ సిక్స్‌ పథకాలను రూపొందించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్‌టిఆర్‌ మున్సిపల్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన ప్రజాగళం మహిళలతో ముఖాముఖిలో ఆయన ప్రసంగించారు. టిడిపి అధికారంలోకొస్తే ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీనిచ్చారు. అమ్మకు వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్న పిల్లలు ఉంటే వారందరికీ రూ.15 వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. తాము అధికారంలోకొస్తే రెండు, మూడు సెంట్ల స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తామని హామీనిచ్చారు. తాను మహిళా పక్షపాతినని, తన హయాంలో మహిళల అభివృద్ధి, సాధికారత, ఆర్థిక స్వావలంబనకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల వ్యవస్థ ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఐదేళ్ల వైసిపి పాలనలో మహిళల జీవితాలు తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. అసమర్థ జగన్‌ పాలనలో ప్రతి కుటుంబానికీ ఖర్చులు పెరిగాయని, ఆదాయం తగ్గిందన్నారు. సంపూర్ణ మద్య నిషేధం హామీనిచ్చి, మద్యం ధరలు పెంచుకుంటూ రూ.లక్షల కోట్లు కొల్లగొట్టి కుటుంబాలను గుల్ల చేశారన్నారు. నాశిరకం మద్యంతో అనారోగ్యం పాలైన వారు, మృతి చెందిన వారూ ఉన్నారని చెప్పారు. ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపారన్నారు. వైసిపి పాలనలో ఒక్క అభివృద్ధి పని లేదని విమర్శించారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్డు నిర్మాణం చేశారా అని ప్రశ్నించారు. మే 13న జగన్‌కు దిమ్మదిరిగే తీర్పునివ్వాలని కోరారు.జిల్లా అభివృద్ధి బాధ్యత తీసుకుంటాశ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. మత్స్యకారుల కోసం మినీ జెట్టీలు ఏర్పాటు చేస్తానని, కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తానని హామీనిచ్చారు. పాలకొండ రోడ్డు, ఔటర్‌ రింగు రోడ్డు నిర్మిస్తామన్నారు. శ్రీకాకుళం నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇతర సమస్యలను పరిష్కరిస్తానన్నారు.ఐవిఆర్‌ఎస్‌లో రామ్మోహన్‌ నాయుడు ఫస్ట్‌ టిడిపి అభ్యర్థుల కోసం నిర్వహించిన ఐవిఆర్‌ఎస్‌ సర్వేలో కింజరాపు రామ్మోహన్‌ నాయుడు రాష్ట్రంలోనే ఫస్ట్‌ వచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వాలంటే తనను అడ్డుకునే వారు ఎవరూ లేరని కానీ, జనామోదం ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని తీర్మానించుకున్నామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌కు టిక్కెట్‌ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చిన తర్వాత సర్వే నిర్వహిస్తే ఆయనకు జనాదరణ ఎక్కువగా ఉందని తేలిందన్నారు. వారిద్దరినీ ఆశీర్వదించాలని కోరారు. వారిని చట్టసభలకు పంపించే బాధ్యత మహిళలదేనన్నారు. జిల్లాకు పట్టిన కేన్సర్‌ ధర్మాన అని విమర్శించారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్‌, బిజెపి, జనసేన జిల్లా అధ్యక్షులు బి.ఉమామహేశ్వరరావు, పి.చంద్రమోహన్‌, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సుజాత, గొండు స్వాతి తదితరులు పాల్గొన్నారు.

➡️