లెక్క తేలిన మూడు పార్టీల అభ్యర్థిత్వాలు

వచ్చే నెలలో

టెక్కలి పోరు రసవత్తరం

  • వైసిపికి గ్రూపుల పోరు, ప్రభుత్వ వ్యతిరేకత
  • మూడోసారి అచ్చెన్న అభ్యర్థిత్వంపై ప్రజల్లో కొంత విముఖత
  • కృపారాణి పోటీతో ‘ఇండియా’ వేదికలో ఆశలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

వచ్చే నెలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి బరిలో నిలిచేదెవరో లెక్క తేలింది. టెక్కలి నియోజకవర్గానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి పేరును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో, మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. వైసిపి నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఎన్‌డిఎ కూటమి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున కృపారాణి బరిలో నిలవనున్నారు. వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని ఇప్పటివరకు అంతా భావించినా, కాంగ్రెస్‌ పార్టీ కృపారాణిని పోటీకి నిలపడంతో ముక్కోణపు పోరు నెలకొంది.టిడిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మూడో పర్యాయం బరిలో దిగుతున్నారు. హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి అది అంత తేలిక కాదని ప్రత్యర్థి పార్టీల నాయకులు అంటున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయానికి అడపదడపా రావడం తప్ప విశాఖలోనే ఎక్కువ గడిపేవారన్న చర్చ నడుస్తోంది. టిడిపి రాష్ట్ర అధ్యక్షునిగా ఎక్కువ సమయం ఇతర జిల్లాలకు కేటాయించారు తప్ప నియోజకవర్గ ప్రజలకు సమయం వెచ్చించలేదన్న ఆవేదన అత్యధికుల్లో ఉంది. ముఖ్యంగా భావనపాడు పోర్టు విషయంలో ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం, ఇవ్వడానికి నిరాకరించిన వారి భూములను ప్రొక్లెయిన్‌తో ధ్వంసం చేయించడం, పోలీసు బలగాలను మోహరించి ఇళ్లు, పశువుల పాకల కొలతలను తీసుకోవడం వంటి దుందుడుకు చర్యలకు దిగినా, ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు తమకు అండగా నిలవలేదన్న బాధ స్థానికుల్లో ఉంది. వర్షాల్లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశాలతో కోటబొమ్మాళి మండలంలోని ఎత్తిపోతల పథకాలకు సాగునీరు ఆపేసినా, అచ్చెన్నాయుడు కనీసం నోరు మెదపలేదనే ఆవేదన రైతుల్లో ఉంది. టెక్కలి నియోజకవర్గానికి సాగు, తాగు నీరందించే ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను టిడిపి హయాంలో పూర్తిచేయలేకపోయారు. శంఖరావం యాత్ర సందర్శంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లాకు వచ్చిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ చెప్పుకొచ్చారు. అంటే మళ్లీ అంచనా వ్యయం పెంచి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం నియోజకవర్గాలకు కేటాయించే నిధులతో రోడ్లు, మంచి నీటి పథకాలు నిర్మించడం తప్ప అధికారంలో ఉన్న ఐదేళ్లు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన మార్కు అభివృద్ధి పెద్దగా లేదనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. సంక్షేమ పథకాలపైనే ‘దువ్వాడ’ ఆశలుఎమ్మెల్సీ, వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ కేవలం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలనే నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. దానిపై ఆయన ప్రధానంగా దృష్టిసారించి ప్రచారం సాగిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్‌షోర్‌ అంచనాలను మళ్లీ పెంచి ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ ఉండదని పైకి చెప్తున్నా, ఐదేళ్ల పాలనలో కచ్చితంగా కొన్ని తరగతుల్లో వ్యతిరేకత సహజం. ప్రత్యేకించి సిపిఎస్‌ విషయంలో ప్రభుత్వం మాట మార్చడం, అంగన్‌వాడీలపై నిరంకుశంగా వ్యవహరించడం వంటి చర్యలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండటం వంటి చర్యలతో ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశం కనిపిస్తోంది. మూలపేట పోర్టు తీసుకొచ్చింది తామేనని, టిడిపి చేయలేని పని తాము చేశామని వైసిపి చెప్పుకుంటోంది. పోర్టులో ఉద్యోగాలు, ఉపాధి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే కొంత ప్రభావం ఉండొచ్చు గానీ నిర్మాణంలోనే అంతా తమకనుకూలంగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు.కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా?ఇండియా వేదిక నుంచి పోటీ చేస్తున్న కిల్లి కృపారాణితో కాంగ్రెస్‌ ఈసారి భారీగా ఓట్ల శాతం పెంచుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయనే చర్చ విస్తృతంగా సాగుతోంది. పిసిసి అధ్యక్షులు షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్‌కు కొంత సానుకూలంగా మారింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవడంతో కాంగ్రెస్‌ పార్టీపై ఆ గాయం ప్రభావం అంతగా ఉండదనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పైగా విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వేజోన్‌, వెనుకబడిన శ్రీకాకుళానికి వెనుబడిన ప్రాంత నిధి ఇవ్వకుండా పదేళ్లు మోసం చేసిన బిజెపికి, ఆ కూటమి తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. దీంతో గణనీయంగా ఓట్లు సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్‌పై ప్రభుత్వం మాట తప్పడం, పిఆర్‌సి, ఐఆర్‌ వంటి విషయంలో ప్రభుత్వం… ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీయడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సాగించిన పోరాటాలను ప్రభుత్వం అణచివేయడం వైసిపికి నష్టం కలిగించనున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. తమ డిమాండ్ల సాధనకు ఆందోళనలు చేసిన అంగన్‌వాడీలు, సమగ్రశిక్ష ఉద్యోగులు, పంచాయతీ వర్కర్ల పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని ప్రయోగించింది. ఉద్యోగుల ఆందోళనలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు కనీసం సంఘీభావం తెలపకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులు, చిరుద్యోగులు వంటి తరగతులు తమకు అండగా నిలుస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

➡️