సమస్యలు ఇవీ…చొరవ చూపాలి

జిల్లాలో అనేక సమస్యలు

మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • మరిపడకేసిన వంశధార, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు
  • హార్బర్లు, జెట్టీల నిర్మాణాలు పూర్తి కాక మత్స్యకారుల్లో ఆగని వలసలు
  • పదేళ్లలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు కాని వైనం
  • కేంద్ర, రాష్ట్ర మంత్రుల పైనే ఆశలునేడు అచ్చెన్న, రామ్మోహన్‌ నాయుడు

* జిల్లాకు రాక

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో అనేక సమస్యలు ముసురుకున్నాయి. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన వంశధార, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు పడకేశాయి. ఐదేళ్లు గడిచినా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా, రైతులను కరువు పరిస్థితులు వీడడం లేదు. పోర్టులు, జెట్టీల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో చేపల వేట సాగక వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. గత ఐదేళ్ల కాలంలో జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతో ఉపాధి కోసం యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతోంది. ఈసారి కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో జిల్లా నుంచి ఇద్దరికి చోటు దక్కడంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతల స్వీకరణ అనంతరం సోమవారం తొలిసారి జిల్లాకు రానున్నారు.వంశధార ప్రాజెక్టు పూర్తికి అనేక పర్యాయాలు ఒప్పంద కాలపరిమితిని పొడిగించినా, ఏనాడూ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం అక్టోబర్‌ 28, 2017 నాటికి పూర్తి కావాలి. ఇప్పటివరకు 94.5 శాతం పనులు పూర్తయ్యాయి. 87 ప్యాకేజీ పనులు 90 శాతం, 88 ప్యాకేజీ పనులు 94 శాతం, హిరమండలం రిజర్వాయర్‌ పనులు 94.50 శాతం పనులు జరిగాయి. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి మరోవైపు భూసేకరణ కూడా పెండింగ్‌లో ఉంది. 87 ప్యాకేజీ కింద చేపడుతున్న కాలువ తవ్వకాలకు 71.32 ఎకరాల భూమి అవసరం. అధికారులు ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసినా, సంబంధిత రైతులకు రూ.9.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోడంతో, కాలువ తవ్వకాలు ముందుకు సాగడం లేదు. 88 ప్యాకేజీ కింద చేస్తున్న కాలువ పనులకు 20.16 ఎకరాలు కావాల్సి ఉంది. రైతులకు రూ.2.92 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తే గానీ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.ఆఫ్‌ఫోర్‌ రిజర్వాయర్‌దీ అదే పరిస్థితిటెక్కలి, నందిగాం, పలాస, మెళియాపుట్టి మండలాల్లోని 24,600 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 2007లో ప్రారంభించిన ఆఫ్‌ఫోర్‌ రిజర్వాయర్‌ నేటికీ పూర్తి కాలేదు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నిర్మాణ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మిగిలిన పనులకు సంబంధించి కొత్త రేట్లతో రూ.855 కోట్ల అంచనా వ్యయంతో 2021 సెప్టెంబరులో అధికారులు ప్రతిపాదనలు పంపగా, 2022 సెప్టెంబరులో సవరించిన అంచనాల మేరకు రూ.852.45 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2014 నుంచి ఇప్పటివరకు 45 శాతం పనులు మాత్రమే జరిగాయి.అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు ఇవే…సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడు పూర్తయ్యే అవకాశం లేనందున సాగునీటి సమస్యల పరిష్కారానికి కొన్ని అత్యవసర పనులు చేపట్టాల్సి ఉంది. వంశధార కుడి, ఎడమ కాలువల్లో విపరీతంగా గుర్రపుడెక్క, పూడిక పేరుకుపోవడంతో సాగునీటి ప్రవాహం సాఫీగా సాగే పరిస్థితి కనిపించడం లేదు. పనులు ఆలస్యంగా మొదలుపెడుతుండడం, సరిపోయినంత నిధులు విడుదల చేయకపోవడంతో కొన్నిచోట్ల రైతులే తమ సొంత డబ్బులతో కాలువల్లో గుర్రపుడెక్క, పూడిక తొలగించుకున్నారు. ఈ ఏడాదైనా తగినంత మేర నిధులు విడుదల చేసి పనులు చేపడితే ఇబ్బందులు తీరుతాయి. ఇప్పటికే అధికారులు వంశధారలో కుడి, ఎడమ కాలువల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులకు రూ.95 లక్షలు అవసరమని వంశధార అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని తక్షణం విడుదలయ్యేలా చూడాల్సిన ఆవశ్యకత ఉంది.ఫిషింగ్‌ హార్బర్‌, జెట్టీల పూర్తితోనే వలసలకు అడ్డుకట్టకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగరమాల ప్రాజెక్టుల్లో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని 2020లో నిర్ణయించారు. 2022 మేలో టెండర్లను పిలిచిన ప్రభుత్వం, విజయవాడకు చెందిన విశ్వసముద్ర ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌కు నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. ఈ ఏడాది మే నాటికి మొదటి దశ పూర్తి చేస్తామని టెండర్లను ఖరారు చేసిన సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం, రాళ్లపేటలో జెట్టీ, కవిటి మండలం ఇద్దివానిపాలెంలో జెట్టీ, సోంపేట మండలం బారువలో జెట్టీ, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుల-మంచినీళ్లపేట జెట్టీ నిర్మాణం పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి.అవసరమేర విత్తనాలు కేటాయించాలిజిల్లాలో 2024 ఖరీఫ్‌లో 3,87,322.5 ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా వేశారు. ఇందు కోసం 1.16 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం 38,882 క్వింటాళ్లు కేటాయిస్తామని చెప్తోంది. రైతుల దగ్గర విత్తనాలు, 50 శాతం మేర ప్రయివేట్‌ డీలర్లకు కేటాయించడంతో సబ్సిడీ విత్తనాలపై కోత విధించింది. దీంతో విత్తనాల కోసం రైతులు బహిరంగ మార్కెట్లో కొనాల్సి వస్తోంది. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం చూడాల్సి ఉంది. పదేళ్లలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ రాని వైనంజిల్లాలో ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. పైగా ఫెర్రో ఎల్లాయీస్‌, జ్యూట్‌ వంటి పరిశ్రమలు మూతపడ్డాయి. ఎన్‌డిఎలో చేరిన టిడిపికి భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి పదవిని బిజెపి కేటాయించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చొరవ చూపి ఒకట్రెండు పరిశ్రమలను జిలాకు తీసుకురాగలిగితే, జిల్లాకు చెందిన యువతకు కొంతమేర ఉపాధి కల్పించే వీలుంటుంది. 2014-18 కాలంలో ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న టిడిపి జిల్లాకు ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థనూ తీసుకురాలేదన్న విమర్శలను మూటగట్టుకుంది. ఈసారైనా అటువంటి ఉన్నత సంస్థలను తీసుకురాగలిగితే అభివృద్ధికి కొంత ఆస్కారం కలుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

➡️