చేయి చేయి కలిపారు.. గోతులు పూడ్చారు

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా

గోతులను పూడ్చుతున్న యువత

ప్రజాశక్తి- బూర్జ

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా యువత తలుచుకుంటే అసాధ్యం అనేది ఏమీ లేదని నిరూపించారు. మండలంలోని నీలంపేట గ్రామ సమీపంలో ఏర్పడిన పెద్ద గోతులు కారణంగా ద్విచక్ర వాహనాలు బోల్తా పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. గత నెల బూర్జ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు సందర్భంగా విధులు ముగించుకొని కొల్లివలస వస్తుండగా సురేష్‌ అనే కానిస్టేబుల్‌ ప్రమాదవశాత్తు ఇదే గోతులో పడి మృతి చెందాడు. అలాగే మంగళవారం రెండు బైకులు ఇదే గోతిలో పడి ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలకు గురయ్యారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు తమవంతుగా రాజుపేట గ్రామ యువత చేయిచేయి కలిపి బుధవారం ఆ గోతులను పూడ్చారు. ఆర్‌అండ్‌బి, పోలీస్‌ శాఖ, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా పట్టించుకోకపోయినప్పటికీ యువత మానవతా దృక్పథంతో శ్రమదానం చేయడంతో మండల ప్రజలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి ప్రతినిధి సుధాకరరావుతో పాటు మణికంఠ, సాయికుమార్‌, ఎం.సాయికుమార్‌, దుర్గాప్రసాద్‌, యశ్వంత్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

➡️