ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు

ఉత్తరాంధ్ర ద్రోహి

మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు

  • ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కే లేదు
  • రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఉత్తరాంధ్ర ద్రోహి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. నగరంలోని హయాతీనగరంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాజధాని పేరిట అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత వాసుల ఆకాంక్షలను ఏనాడూ నెరవేర్చలేదన్నారు. అలాంటి చంద్రబాబు ఇవాళ మళ్లీ ఓటు అడిగేందుకు వస్తున్నాడని, ఈ ప్రాంత వాసులకు ఓటు అడిగే హక్కు ఆయనకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే రంగుల కాగితం కాదన్నారు. అదో పవిత్ర గ్రంథంగా భావించి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాకనే ఓటు వేయాలని ప్రజల ముందుకు వస్తున్నామన్నారు. చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు కేటాయిస్తే, వాటిలో ఏ ఒక్కటీ జిల్లాకు కేటాయించిన దాఖలాల్లేవన్నారు. టిడిపి కూటమి విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నవన్నీ దొంగ హామీలన్నారు. మేనిఫెస్టో దొంగది, చంద్రబాబు అమలు చేయరు కాబట్టే బిజెపి బొమ్మ వేయొద్దని వారు చెప్పారని తెలిపారు. ఆ మూడు పార్టీలకు కామన్‌ ఐడియాలజీ లేదన్నారు. చంద్రబాబు మోసకారి నైజానికి ఇది తార్కాణమన్నారు.

➡️