వైసిపి గెలిస్తే విశాఖే రాజధాని

ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి విశాఖ

మాట్లాడుతున్న మంత్రి ప్రసాదరావు

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి విశాఖ రాజధానితోనే సాధ్యమని, వైసిపి అథికారంలోకి వస్తే విశాఖ రాజధాని కచ్చితంగా వస్తుందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు చేతిలో ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వెనకబాటుకు నెట్టబడిందని, తిరిగి ఆయనును నమ్మి మోస పోవద్దని వ్యాఖ్యానించారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో వాకర్స్‌, క్రీడాకారులతో ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మళ్లీ వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ నుంచే పాలన అందించేందుకు దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రాజధానిపై టిడిపి స్టాండ్‌ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టిడిపి నాయకులు అచ్చెన్నాయుడు, రామ్మోహననాయుడు, కూన రవికుమార్‌లు ప్రజలకు ఏం చెపుతారని ప్రశ్నించారు. 1983 నుంచి టిడిపికి కంచుకోటగా ఉన్న జిల్లాకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏఒక్కటి కేటాయించపోయినా జిల్లాలోని టిడిపి నాయకులు ఎందుకు నోరెత్తలేదన్నారు. స్టేడియం నిర్మాణాలను కూలదోసింది టిడిపి కాదా? అని ప్రశ్నించారు. స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు మంజూరు చేయించింది వైసిపి ప్రభుత్వమని, తిరిగి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో తూర్పు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, వైసిపి నాయకులు మెంటాడ స్వరూప్‌, సాధు వైకుంఠం, బిర్లంగి రామ్మోహనరావు, శిమ్మ రాజశేఖర్‌ సుంకరి కృష్ణ, దుంగ సుధాకర్‌, అంధవరపు రమేష్‌, స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ అధ్యక్షులు బి.వి.రవిశంకర్‌, శాసపు జోగినాయుడు పాల్గొన్నారు.

 

➡️