సంక్షేమ పాలన అందిస్తాం

వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సాగించిన

కాళీప్రసాద్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – కవిటి

వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సాగించిన అరాచకాలను భరించలేక, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. మండలంలోని లండారిపుట్టుగ సర్పంచ్‌ మురపాల కుమారి, మురపాల కాళీప్రసాద్‌ కొండిపుట్టుగలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉందని, చివరకు పింఛను డబ్బులు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుందని విమర్శించారు. ప్రగతికి పట్టుకొమ్మలైన పంచాయతీలకు అందించాల్సిన నిధులనూ పక్కదారి పట్టించి పంచాయతీల అభివృద్ధికి గండికొట్టిన ఘనత వైసిపి ప్రభుత్వానిదని ఆరోపించారు. రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విడదీసిన పరిస్థితుల్లో విభజన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తే, వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. సైకోకి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలు పశ్చాత్తాపం చెందుతున్నారని, తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దే అనుభవజ్ఞుడైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన సంక్షేమ పాలన టిడిపి ప్రభుత్వం అందిస్తుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, జనసేన ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి రాజు, ఎమ్మెల్యే అశోక్‌ సతీమణి బెందాళం నీలోత్పల, బిజెపి కార్యదర్శి కృష్ణ, నాలుగు మండలాలకు చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

➡️