14 ఏళ్ల పాలనలో ఏం చేశారు?

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు

  • అప్పుడు జిల్లా అభివృద్ధి గుర్తుకు రాలేదా?
  • చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరు

రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుప్రజాశక్తి – పలాస14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు చేసిన అభివృద్ధి పనులు ఏమిటని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. అప్పుడు రాని జిల్లా అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని అన్నారు. స్థానిక ప్రగతి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు బాబు పరిపాలనను చూశారని రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో, ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసుననన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో బాబు ప్రభుత్వంలో ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేసిన పి.వి రమేష్‌ పాత్ర ఉందనడానికి బాబు స్వహస్తాలతో రాసిన లేఖలు ఉన్నాయన్నారు. విశాఖపట్నం నుంచి భావనపాడు వరకు బీచ్‌ రోడ్డు నిర్మించి పరిశ్రమలు, పర్యాటక ప్రదేశాలుగా మార్చుతానని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు అనిపించడం లేదన్నారు. తన పాలనలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అగ్గిపెట్టె అంత స్థలం ఇచ్చారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో టిట్కో ఇళ్లు ఎంత విస్తీర్ణమని ప్రశ్నించారు. పలాస నియోజకవర్గంలో కొండలు మింగేందుకు ప్రయత్నించిన నాయకులను తాను పక్కన పెడితే వారికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారన్నారు. రుషికొండ కోసం ప్రతిసారీ మాట్లాడుతున్న చంద్రబాబు, విశాఖపట్నంలో కొండలపై రామానాయుడు, రామోజీ కట్టిన ఫిల్మ్‌ సిటీ నిర్మాణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయన ఇచ్చే హామీలు, చెప్పే మాటలు ప్రజలకు ఇప్పటికే అర్థమైందని, ఆయన ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం లేదన్నారు.

➡️