మున్సిపల్‌ కార్మికులపై పనిభారం తగ్గించాలి

నగరపాలక సంస్థ పరిధి

మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు

  • కమిషనర్‌ను కోరిన ఫెడరేషన్‌ నాయకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరపాలక సంస్థ పరిధిలో కార్మికుల సంఖ్యను పెంచి పనిభారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) నగర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.బలరాం, ఎ.గణేష్‌ కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియాను శనివారం కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ విస్తీర్ణం పరిధి గతం కంటే విస్తృతమైందని, పరిధి పెరిగినా పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచకపోవడం వల్ల కార్మికులపై పనిభారం పడుతోందని వివరించారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని పలుమార్లు కోరుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీనివల్ల ఒత్తిడి పెరిగి కార్మికులు అనారోగ్యంపాలవుతున్నారని చెప్పారు. దీనికితోడు వేసవి తీవ్రత , పనిఒత్తిడి కారణంగా పడుతున్న ఇబ్బందులను ఆమెకు వివరించారు. రోడ్లు ఊడ్చడం, కాలువలు తీయడం, చెత్తను ఎత్తుకోవడం ఒకరే చేయాల్సి వస్తోందన్నారు. ఈ పనులన్నీ చేయడం తలకు మించిన భారంగా ఉందన్నారు. ఈ మూడు పనులు చేయడానికి ముగ్గురు అవసరమున్నా ఒక్కరితోనే చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్త సేకరించే వాహనాలకు సరిపడినంత మంది కార్మికులు లేరని, వారికీ వార్డుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులే సహకరించాల్సి వస్తోందన్నారు. వీటికితోడు చెత్త తీసుకెళ్లే తోపుడుబళ్లు, చెత్త బిన్‌లు, వారానికి సరిపడా పనిముట్లు సరఫరా సరిగా జరగడం లేదని చెప్పారు. పనిముట్లు లేక కార్మికులు ఇబ్బంందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, నగర కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నగర కమిటీ నాయకులు మోహన్‌, శంకర్‌, గురుస్వామి, జనార్థన్‌, బుజ్జీశ్వరావు, ఎ.రాము, జె.మాధవి, బి.సరోజిని తదితరులు పాల్గొన్నారు.

➡️