అంకితభావంతో పనిచేయాలి

ఉపాధి హామీలో ప్రతి ఉద్యోగీ

మాట్లాడుతున్న శివప్రసాద్‌

  • గ్రామీణాభివృద్ధి జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఉపాధి హామీలో ప్రతి ఉద్యోగీ అంకితభావంతో పనిచేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ అన్నారు. నగరంలోని డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎపిడిలు, ఎపిఒలు, ఇసిలు, టిఎలతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న కూలీందరికీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఖర్చు చేసిన ప్రతి పైసా పూర్తిస్థాయిలో సద్వినియోగమయ్యేలా సిబ్బంది ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చెరువుల్లో, కాలువల్లో పూడికతీత పనులకు ప్రాధాన్యతను తగ్గించి భూగర్భ జలమట్టాన్ని పెంపొందింపజేయాలన్నారు. కందకాలు, ఫారం పాండ్‌, సరిహద్దు కందకాలు, వృత్తాకార కందకాలు, రూప్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ వంటి ఇతర పనులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. చెరువుల్లో మెరక భాగాల్లో ఫిష్‌ పాండ్‌ల పనులు చేపట్టడం ద్వారా కూలీలకు అధిక ఉపాధి పనిదినాలు కల్పించడంతోపాటు ఆయా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఈ పనులు చేపట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఉద్యోగులకు సూచించారు. చెరువుల్లో పూడికతీత పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేశామని స్పష్టం చేశారు. కూలీలకు కొలతల మేరకు పనులు చేపట్టడంపై సాంకేతిక సలహాలను ఇవ్వడం ద్వారా గరిష్ట కూలి అందేవిధంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. సిబ్బందికి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో పర్యటించారు. ప్లాంటేషన్‌, చెరువు పూడికతీత పనులు, ఫారం పాండ్‌ తదితర పనులను జాయింట్‌ కమిషనర్‌ పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.వి.చిట్టిరాజు, ఫైనాన్స్‌ మేనేజర్‌ స్వరూపరాణి, విజిలెన్స్‌ అధికారి బి.లవరాజు, ఎపిడిలు పి.రాధ, మురళీకృష్ణ, శైలజ, లోకేష్‌, కార్యాలయ సూపరింటెండెంట్‌ మురళీధర్‌ పాల్గొన్నారు

.

➡️