వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపాలి

రాష్ట్రాన్ని సర్వనాశనం

మందస : ఎన్నికల ప్రచారం చేస్తున్న రోహిత్‌

  • సినీ నటుడు నారా రోహిత్‌

ప్రజాశక్తి – పలాస, మందస

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో సాగనంపాల్సిన సమయం వచ్చిందని సినీ నటుడు నారా రోహిత్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి పలాస అభ్యర్థి గౌతు శిరీషకు మద్దతుగా మందస మండలం మధ్యదేవపురం, సవరమధ్య, నర్సింగపురం, మందస, హెరీన్నాళి తదితర గ్రామాల్లో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పలాసలోని టిడిపి కార్యాలయంలో గౌతు శిరీషతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకొచ్చిన జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారని ఆరోపించారు. ఏటా జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తామని చెప్పి చివరకు నిరుద్యోగులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్న దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఒక్క కొత్త పరిశ్రమ నెలకొల్పలేదు సరికదా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు అని, ఆయన సిఎం అయితే పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇప్పుడు అందరూ చంద్రబాబు వైపు చూస్తున్నారని చెప్పారు. ఓటు హక్కుతో జగన్‌ను గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. టిడిపి అభ్యర్థి గౌతు శిరీష మాట్లాడుతూ జగన్‌ పాలనలో సినీ పరిశ్రమనూ విడిచిపెట్టలేదన్నారు. ఏ సినిమా టిక్కెట్లు ఎంత రేటుకు అమ్మాలో ఆయనే నిర్ణయించారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే దామోదరసాగర్‌, కళింగదళ్‌ ప్రాజెక్టుల ఆధునీకరణ చేపట్టి పంట భూములకు సాగునీరందేలా చేస్తానని హామీనిచ్చారు. జీడి రైతులను ఆదుకుంటామని, జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల మధ్య జీడి బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. జీడి అనుసంధాన పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సంతోష్‌కుమార్‌ పండా, టిడిపి నాయకులు రట్టి లింగరాజు, దాసరి తాతారావు, జి.కె నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️