శృంగవరపుకోటను విశాఖలో విలీనం చేస్తాం

Apr 22,2024 22:35

భీమసింగిపైనా ఆలోచిస్తా..

ఐటి టవర్‌తో వర్‌ ఫ్రమ్‌ హోం

ఉత్తరాంధ్రలో రూ.40 వేల కోట్ల ఆస్తిని జగన్‌ దోచేశాడు

ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పండి

ప్రజాగళం సభలో చంద్రబాబు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి, ఎస్‌కోట : కూటమి అధికారంలోకి వస్తే ఎస్‌.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించే విషయాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు. విశాఖను అభివృద్ధి చేసినట్లే ఎస్‌కోటను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎస్‌.కోటలోని దేవిబొమ్మ జంక్షన్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఎస్‌కోటలో ఐటి టవర్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొత్తవలసలో డిగ్రీ కాలేజీ నిర్మాణం, పుణ్యగిరిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఉత్తరాంధ్రలో రూ.40వేల కోట్ల ఆస్తిని జగన్‌ దోచేశాడని, ప్రజా ధనం రూ.500 కోట్లతో రిషికొండను తవ్వేసి భవంతులు కట్టాడని, అటువంటి వ్యక్తికి రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. అతని బంగ్లాలు కట్టుకుని పేదలకు శ్మశానాలు, చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడన్నారు. ప్రమాదకరమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చి ప్రజల ఆస్తులను దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రికార్డులను తీసేసి ఆన్‌లైన్‌లో వివరాలను పెట్టి వారికి నచ్చిన పేరున మార్చి కబ్జాచేసే కుట్ర చేస్తున్నారన్నారు. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే ప్రజలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. మన తాత తండ్రుల నుంచి వచ్చిన భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలపై అతని బొమ్మ వేయించు కున్నాడని, ఆఖరికి పొలంలో హద్దులకు వినియోగించే రాళ్లపైన కూడా అతని బొమ్మ పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 200 ఉండే కరెంటు బిల్లును రూ. 1000 చేశాడని, రూ.60 ఉండే మద్యం సీసాను రూ. 200 చేశాడని, రూ. 5వేలు ఉండే ఇసుకను రూ. 50 వేలు చేశాడని చెప్పారు. పెట్రోలు అధిక రేట్లలో దేశంలో నెంబర్‌ వన్‌ స్థానంలో మన రాష్ట్రం ఉందన్నారు. ఇవన్నీ తగ్గాలంటే కూటమి విజయం సాధించాలన్నారు.పోలవరం నీరు ఉత్తరాంధ్రకు ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగునీటి కోసం పోలవరం ద్వారా వస్తున్న నీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా రైతులకు అందిద్దామని ఆ ప్రాజెక్టును ప్రారంభించామని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే జగన్‌ ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పట్టించుకోలేదని, దీంతో ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాను అధికారంలోకి రాగానే పోలవరం నీటిని సుజల స్రవంతి ద్వారా రైతులకు అందిస్తామని చెప్పారు.

శృంగవరపుకోటను విశాఖలో విలీనం చేస్తాం

వైసిపి వ్యతిరేక ఓటు చీలరాదు

జగన్‌ అహంకారానికి చెక్‌పెట్టాలంటే వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడదని, ఇదే విషయాన్ని నాలుగేళ్ల క్రితమే పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారని అన్నారు. 2014లో కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్‌ పనిచేశారని, ఇప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం పరిమితమైన సీట్లలో పోటీచేస్తున్నారని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో కష్టపడి పనిచేసే యువత, చదుకున్న నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. దేశ ఆర్మీలో ఉత్తరాంధ్రకు చెందిన యువతే అత్యధికంగా ఉంటారని చెప్పారు. అటువంటి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడం జగన్‌కు చేతకాలేదని విమర్శించారు. జగన్‌ గంజాయి, డ్రగ్స్‌ సరఫరా చేయించడం వల్ల పిల్లలు నాశనమై పోతున్నారన్నారు. తాను అధికారంలోకి రాగానే మెగా డిఎస్‌సి నిర్వహిస్తామని, ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని స్పష్టం చేశారు. యువతను దృష్టిలో పెట్టుకుని తాను ఈ ప్రాంతానికి ట్రైబుల్‌ యూనివర్శిటీ తీసుకొస్తే ఈ ఐదేళ్లలో జగన్‌ దాన్ని ముందుకు తీసుకెళ్లలేదన్నారు. ఎస్‌కోటను ఎమ్మెల్యే అవినీతి కోటగా తయారు చేశాడుఇక్కడ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎస్‌కోట కొండను కొట్టి రూ.50కోట్లతో ఇళ్లుకట్టారని ఆరోపించారు. దొంగ పట్టాలు సృష్టించి భూములను లాక్కుంటున్నారని, ఇసుక అక్రమ రవాణాను బందువులకు అప్పగించారని, గంజాయిను ప్రోత్సహించి యువత జీవితాలను నాశనం చేస్తున్నాడని అన్నారు. ఈ సారి అతనికి బుద్ది చెప్పి ఎంతో చరిత్ర ఉన్న కోళ్ల కుటుంబాన్ని గెలిపించాలని కోరారు. ఆమె గెలుపునకు గొంప కృష్ణ, జనసేన, బిజెపి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

➡️