స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలను వ్యతిరేకించాలి

May 15,2024 23:40 #Chnr Press meet
Ch.Narsingarao press meet

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ కేంద్ర ప్రభుత్వం, అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం కలిసి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు చేస్తున్న కుట్రలను ప్రజలు వ్యతిరేకించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైఫల్యం వల్ల 25 రోజుల నుంచి పోర్టు స్తంభించిందని, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం జాప్యం చేస్తోందని విమర్శించారు. గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పర్మినెంట్‌ కార్మికులకు బేసిక్‌ కేవలం రూ.3400 మాత్రమే ఇస్తున్నారని, నైపుణ్యం గల పోర్టు ఆపరేషన్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్స్‌కు కూడా నెలకు రూ.17000 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. బోనస్‌ చట్టప్రకారం చెల్లించడం లేదన్నారు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఈ నెల 3న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అదానీ పోర్టు యాజమాన్యం అమలు చేయలేదన్నారు. గంగవరం పోర్టు కార్మికులు ఏప్రిల్‌ 30వ తేదీ నుంచి డ్యూటీలో చేరడానికి సిద్దపడినా యాజమాన్యం చేర్చుకోలేదని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం అదానీ పోర్టుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గంగవరం పోర్టుకు మధ్య గోడమాత్రమే ఉందని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 2.5 లక్షల టన్నుల కోకింగ్‌ కోల్‌ను స్టీల్‌ప్లాంట్‌కు పంపకుండా గంగవరం పోర్టులోనే నిలిపివేసిందని తెలిపారు. కోక్‌ఓవెన్‌ డిపార్టుమెంట్‌లో రోజుకు 400 హీట్లు జరగాల్సిన ఉత్పత్తి కోకింగ్‌ కోల్‌ సరఫరా కానందున వంద హీట్లకు పడిపోయిందన్నారు. కోక్‌ఓవెన్‌ బ్యాటరీలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నూరుశాతం విశాఖ స్టీల్‌ వాటాను అమ్మాలన్న నిర్ణయం కార్మికుల పోరాటంతో ఆగిపోయిందని తెలిపారు. దొడ్డిదారిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అమ్మడానికి ఈ కుట్ర సాగుతోందన్నారు. గంగవరం పోర్టును విశాఖ స్టీల్‌ప్లాంట్‌కోసం నిర్మించారని, దాన్ని ప్రైవేట్‌ యాజమాన్యానికి అప్పగించడం వల్ల నేడు విశాఖ స్టీల్‌ కష్టాల్లోకి నెట్టబడిందని వివరించారు. గంగవరం పోర్టును విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు స్వాధీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కోకింగ్‌ కోల్‌ను వెంటనే సరఫరా చేయాలని ఈ నెల 3వ తేదీన ఎపి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా గంగవరం పోర్టు యాజమాన్యం నేటికీ అమలు చేయలేదని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు కెఎం.కుమారమంగళం పాల్గొన్నారు.

➡️