విజయం తధ్యం : కళా

May 18,2024 20:24

ప్రజాశక్తి- చీపురుపల్లి : తమ విజయం తధ్యమైందని మెజార్టీపైనే ఆలోచన అంతా అని చీపురుపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, నాలుగు మండలాల పార్టీ అద్యక్షులతో కలసి స్థానిక నటరాజ్‌ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1983, 1994 ఎన్నికల్లో ఏ విధమైన ప్రజా స్పందన కనిపించిందో అదే స్పందన ఈ ఎన్నికలలో కూడా స్పష్టంగా కనిపించిందన్నారు. బంగాళాఖాతంలో వైసిపిని కలపకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని, సంక్షేమంలో కూడా ఒక చేత్తో పది రూపాయలు ఇస్తే మరో చేత్తో వంద రూపాయలు పన్నులు ధరలు పెంచుతున్నాడని జగన్‌మోహన్‌రెడ్డిపై విసుగు చెంది టిడిపికి ప్రజలు పట్టం కట్టేందుకు ముందుకు వచ్చి ఓట్లు వేసారన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును జగన్‌ కాలరాశాడని మైనింగ్‌, సారా, ఇసుకలో దోచుకోవడం దాచుకోవడమేపనిగా చేసారని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ చేతులో పెట్టుకొని ప్రజలను భయబ్రాంతులను చేయడం వల్ల ఈ భూతాన్ని వదిలించుకోవాలని ప్రజలు భావించి పెద్ద ఎత్తున ఓటింగ్‌ వేశారన్నారు. చంద్రబాబు అధికారంలోనికి వస్తే సంక్షేమంతో పాటు అభివృధ్ది చేయగలడనే నమ్మకంతో టిడిపి ఓట్లు వేశారన్నారు. జగన్‌ లండన్‌ వెలుతూ అధికారులను మభ్యపెట్టడం కోసం తాము గెలిచేస్తామని డాంభికాలు పలికారని చెప్పారు. పైపైన చెప్పిన మాటలే తప్ప అవి జగన్‌మోహన్‌రెడ్డి గుండె నుంచి వచ్చినవి కాదన్నారు. విశాఖపట్నం సముద్రం ఒడ్డున ప్రమాణ స్వీకారం చేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పడం చూస్తే అధికారులను భయపెట్టి మిగిలిన పనులు చేయించుకునేందుకేనని స్పష్టమవుతుందన్నారు. ప్రజల ఆగ్రహానికి వైసిపి గురయ్యిందని కూటమి 160 సీట్లు సాధిస్తుందని జోష్యం పలికారు. ఎన్నికలలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, యువత, మిత్ర పక్షాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

➡️