గెలిపిస్తే అభివృద్ధి చేస్తా: తాటిపర్తి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వైసీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి యర్రగొండపాలెం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో ప్రజలకు చేసిన మేలును తెలిపారు. ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. పేదలు ఎక్కువగా వలసలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. తీగలేరు కాలువ ద్వారా సాగునీరు అందిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్‌, జడ్పి కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌ బాషా, వైసీపీ మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, సర్పంచ్‌ రామావత్‌ అరుణాబాయి, నాయకులు కందూరి గురు, నర్రెడ్డి వెంకటరెడ్డి, సింగా ప్రసాద్‌, మేడగం వెంకటరెడ్డి పాల్గొన్నారు. పెద్దదోర్నాల: వైసీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్‌ను గెలిపించాలని తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నయ్య తాటిపర్తి సుధాకర్‌ కోరారు. ఆదివారం వైసీపీ శ్రేణులతో కలిసి పెద్దదోర్నాల పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం వెనుకబాటుతనానికి గల కారణాలను వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. కేవలం నియోజకవర్గంలో సేవ చేసేందుకు జగనన్న తన తమ్ముడు చంద్రశేఖర్‌ను ఇక్కడికి పంపించారని కోరారు. ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గంటా వెంకట రమణారెడ్డి, ఎంపిపి గుమ్మా పద్మజ యల్లేష్‌, సర్పంచ్‌ చిత్తూరి హారిక, నాయకులు మజీద్‌, గుమ్మా యల్లేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️