టిడిపి హామీల చిట్టా… అబద్దాల పుట్ట

Apr 27,2024 21:45

 ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసగించడానికి టిడిపి కూటమి ప్రకటించిన హామీల చిట్టా అబద్దాల పుట్ట అని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఖర్చు కన్నా టిడిపి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు. నవరత్నాల పథకాల అమలుతోనే రాష్ట్రం దివాళా తీసిందని విమర్శించిన చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఖర్చు ఎక్కడ నుంచి పెడతారని ప్రశ్నించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లు అవాస్తవాలు మాట్లాడారని చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థపై మొదట్లో టిడిపి, జనసేన నాయకులు లేనిపోని విమర్శలు చేశారని, ఆ తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. వాలంటీర్లకు రూ.10వేలు జీతం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పట్ల నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాలకు రహదారులు, వంతెనలు నిర్మించిన ఘనత రాజన్నదొరదేనని చెప్పారు. గతంలోనే మాదిరిగా ఉమ్మడి జిల్లాలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలనువైసిపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ మోసగించడానికే టిడిపి ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించిందని చెప్పారు. తన హయాంలో అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో చూపించడానికి సిధ్ధమని, టిడిపి అనుకూల మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని రాజన్నదొర ఆరోపించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గొర్లి జగన్మోహన్‌ రావు,జెడ్పీటీసీ మావుడి వాసు నాయుడు పాల్గొన్నారు.

➡️