ఓటర్లకు ప్రలోభాలు

May 10,2024 20:50

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌/కోట :  ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ పరిశీలకులను పెట్టినా, రహస్యంగా అభ్యర్థుల తరుపున కొన్ని బృందాలు గురువారం నుంచే ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించారు. ఇటీవల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నగదు, మద్యం ఇతర వస్తువులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ భారీ ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ ప్రారంభమైంది. వైసిపి, టిడిపిలకు ఈ ఎన్నికలు జీవనర్మణ సమస్యగా మారడంతో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్లకు డబ్బులు ఎర వేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఉద్యోగులకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే కొంతమంది ఉద్యోగులు డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేశారు. అందించారు. నాలుగు రోజులు పాటు అభ్యర్థులు, వారి అనుచరులు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌పై దృష్టి సారించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సామాజిక తరగతులతో ఆత్మీయసమావేశాలు నిర్వహించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో తమకు మద్దతివ్వని సామాజిక తరగతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కువ మందిని ప్రభావితం చేయకలిగిన వారిని పిలిపించి మద్దతుకోరడంతోపాటు కాళ్లబేరానికి దిగుతున్నారు. వ్యక్తిగత అంశాలతో పాటు సామాజిక అంశాలపైనా టిడిపి, వైసిపి నేతలు హామీలు గుప్పిస్తున్నారు. వ్యాపారు లను వివిధరూపాల్లో మచ్చిక చేసుకుని గతంలో జరిగిన ఘటనలను పునరావృత్తం కాకుండా చూస్తామని పలువురు వైసిపి అభ్యర్ధులు ప్రస్తావిస్తున్నారు. గతంలో తమకు అనుకూలంగాపనిచేయని సామాజిక తరగతులను ఆకట్టుకునేందుకు టిడిపి కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. మరోవైపు శుక్రవారం నుంచి వైసిపి, టిడిపి అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ ప్రారంభించారు. విజయనగరంలో వైసిపి, టిడిపి కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తూ స్లిప్‌తో పాటు వెయ్యి రూపాయలు అందించారు. ఇద్దరి వద్ద డబ్బులు తీసుకున్న అధిక మంది ఓటర్లు తమ ఓటును ఏ పార్టీకి వేస్తారో వేచి చూడాల్సిందే.

➡️