మూడు చోట్ల ఉద్రిక్తత

May 13,2024 22:24

ప్రజాశక్తి- రేగిడి: రాజాం నియోజకవర్గంలోని రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం మండలాల్లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకే ప్రారంభించిన పోలింగ్‌ పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరయ్యారు. రేగిడి మండలం సంకిలి, పెద్దపుర్లి, వావిలివలస గ్రామ పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసిపి, టిడిపి నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బూరాడ, సంకిలి గ్రామాల్లో ఇవిఎంలు 45నిమషాలు మొరాయిం చడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్దపుర్లిలో వైసిపి నాయకులు రిగ్గింగ్‌కు ప్రయత్నించగా టిడిపి నాయకులు అడ్డుకుని గొడవకు దిగారు. దీంతో ఇరు గ్రూపులను పోలీసులు చెదర కొట్టారు. ఏ. వెంకటాపురం పోలింగ్‌ బూత్‌లో వైసిపి, టిడిపి నాయకులు గొడవపడటంతో పిఒ సర్థి చెప్పారు. రాజాం మండలం ఒమ్మి, చీకటిపేటలో ఇవిఎంలు మొరాయించడంతో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సంతకవిటి మండలంలో ఒకటి, రెండు చోట్ల స్వల్ప ఘర్షణలు పడ్డారు. అయితే పోలింగ్‌ కేంద్రాల వద్ద సరైన బందోబస్తు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు లేకపోవడంతో సిబ్బందితో పాటు ఓటర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. వంగర: మండలంలో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కే కొత్తవలస, కొప్పర, మద్దివలస గ్రామాలలో చిన్నపాటి ఘర్షణలు జరిగినప్పటికీ ఆయా గ్రామాలలో రాజాం రూరల్‌ సిఐ ఎస్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వైవి జనార్ధన్‌తో కలిసి అక్కడకు చేరుకొని ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా చేశారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు ఉదయం నుంచే చేరుకుని ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఈవీఎంలపై సరైన అవగాహన లేకపోవడంతో పోలింగ్‌ నెమ్మదిగా సాగింది. దీంతో ఓటర్లు క్యూలైన్లలో ఎక్కువసేపు ఉండవలసిన పరిస్థితి నెలకొంది. విద్యుత్తు మధ్య మధ్యలో ఆగిపోతుండటంతో ఓటర్లు, ఎన్నికల సిబ్బంది కొంతమేర ఇబ్బంది పడ్డారు.

➡️