పకడ్బంధీగా పరీక్షలు

May 22,2024 19:53

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి

టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీపై సమీక్ష

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్న పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. పదోతరగతి, ఇంటర్‌, ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ పరీక్షలు, డిఇఇ సెట్‌ నిర్వహణపై తన ఛాంబర్‌లో బుధవారం సమీక్షించారు. పరీక్షలకు చేస్తున్న ఏర్పాట్లను ఆయాశాఖల అధికారుల ద్వారా తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, మాల్‌ ప్రాక్టీస్‌ జరగకండా చర్యలు తీసుకోవాని ఆదేశించారు. దీనికోసం ఎంపిడిఒలు, తాహశీల్దార్లతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని, సమీపంలోని జెరాక్స్‌, నెట్‌ సెంటర్లను మూసి వేయాలని సూచించారు. ప్రశ్నాపత్రాల స్ట్రాంగ్‌ రూములవద్ద పటిష్ట భద్రత కల్పించాలని, వాటిని తరలించేటప్పుడు తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలను ముందుగానే తనిఖీ చేసి, అన్ని వసతులూ కల్పించాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ఆర్‌టిసి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు, అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఆయా ప్రభుత్వ శాఖలు కంట్రోలు రూములను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో డిఆర్‌ఒ వనతి, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, ఆర్‌ఐఒ ఎం.ఆదినారాయణ, డివిఇఓ ఎస్‌.భీమశంకర్‌, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, డిఇసి సభ్యులు ఎం.సత్యనారాయణ, కె.అప్పారావు, ఎన్‌.రామకష్ణ, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ టి.సన్యాశిరాజు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. 24 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఈనెల 24 నుంచి జూన్‌ 3 వరకు పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష ఉదయం 9.30కి మొదలై మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతుంది. మొత్తం 4210 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 2482 మంది బాలురు, 1728 మంది బాలికలు ఉన్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 19 మంది ఛీప్‌ సూపరింటిండెంట్‌లను, 19 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 185 మంది ఇన్విజిలేటర్లును ఏర్పాటు చేస్తున్నారు. 24న డిఇఇ సెట్‌ ఈ నెల 24వ తేదీన డిఇఇ సెట్‌ జరుగుతుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగే ఈ పరీక్ష కంప్యూటర్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో, స్థానిక జెఎన్‌టియు జంక్షన్‌ సమీపంలోని సత్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో నిర్వహిస్తారు. మొత్తం 256 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. జూన్‌ 1 నుంచి ఓపెన్‌ స్కూల్‌ సప్లిమెంటరీ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 1 నుంచి 8 వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటలు వరకు జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పదోతరగతి పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 548 మంది రాయనున్నారు. ఇంటర్‌ పరీక్షలకు 3 పరీక్షా కేంద్రాల్లో 664 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక ఛీప్‌ సూపరింటిండెంట్‌, ఒక డిపార్ట్‌మెంట్‌ అధికారిని నియమించారు. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 65 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ 10 నుంచి 12 వరకు జరుగుతాయి. 24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ ఈ నెల 24 నుంచి 31 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు 14,904 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 7927 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం 42 పరీక్షా కేంద్రాల్లో, మొదటి సంవత్సర పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటలు వరకు, రెండో సంవత్సర పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక ఛీఫ్‌ సూపరింటిండెంట్‌, మరో అదనపు ఛీఫ్‌ సూపరింటిండెంట్‌ను నియమించారు. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను, 500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

➡️