ఆ కేంద్రాలతో సమస్యే!

May 6,2024 21:18

సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడటంతో ఎన్నికల ఆధికారులు, పోలీసులు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సమస్యాత్మక కేంద్రాలపై దృష్టిసారించారు. ఓటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా ఉండేందుకు ముందస్తు భద్రతా ప్రణాళికలు చేపట్టారు. ఇది వరకే అధికారులు కేంద్రాలను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలెట్టారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినచోట అధికారులు పోలింగ్‌ శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం జిల్లాలో 1173 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 342 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. మెంటాడ మండలం ఆండ్రలో రెండు, శృంగవరపుకోట మండలంలో రెండు కేంద్రాలను రూట్లు లేని కేంద్రాలుగా గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత పోలింగ్‌ కేంద్రాలు జిల్లాలో లేవు. జిల్లాలో 17,051 బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. సుమారు 150 రౌడీషీట్‌ కేసులు తెరిచారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 1031 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. జిల్లాలో 25 పోలింగ్‌ కేంద్రాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేకంగా అధికారులు గుర్తించారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లకు పోలీసులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 11 నియోజకవర్గాలను పరిశీలిస్తే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు… సాలూరు నియోజకవర్గంలో ఎక్కువ (148)గా ఉన్నాయి. తక్కువగా పాలకొండ (15), చీపురుపల్లి (12)లో ఉన్నాయి. జిల్లాలో నియోజకవర్గాల సమగ్ర సమాచారాన్ని పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఎక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది? ఏ పోలింగ్‌ బూత్‌లలో గొడవలకు ఆస్కారముంటుంది? అక్కడ చేపట్టాల్సిన రక్షణ చర్యలేమిటి? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో పోలీసులు కసరత్తు చేపట్టారు. ముఖ్యంగా ఓటింగ్‌ జరిగే రోజున ఊహించని సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, పూర్తి భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు.

➡️