పురాతన పట్టణం.. సాలూరు..

Apr 18,2024 21:03

సాలూరు.. వేగావతి నది తీరాన వెలిసిన ఓ పట్టణం.. రాష్ట్రంలో అతి పురాతన మున్సిపాలిటీ. దీని కేంద్రంగా 1951లో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. తొలుత జనరల్‌ నియోజకవర్గంగా ప్రారంభమై క్రమేణా ఎస్‌టి నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 72 ఏళ్ల చరిత్ర కలిగిన సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధి మూడడుగులు ముందుకు, ఆరడుగుల వెనక్కి అన్న చందంగా తయారైంది. నియోజకవర్గం ఆవిర్భవించిన సమయంలో మొత్తం ఓటర్లు 77,570 మంది. ఇప్పుడు 1,90,619 మంది. సాలూరు మున్సిపాలిటీ, మండలం, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది. ఇది పూర్తిగా వ్యవసాయ ప్రధాన ప్రాంతం. రైతులు, రైతు కూలీలు అధికంగా ఉన్నారు.

ప్రజాశక్తి-సాలూరు: సాలూరు నియోజకవర్గంలో పుష్కలంగా జలవనరులు ఉన్నా వాటిని వినియోగంలోకి తేవడంలో పాలకులు విఫలమయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందున్న రూపురేఖలు… తర్వాత మారిపోయాయి. 2008 నియోజకవర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముందు ఈ నియోజకవర్గంలో రామభద్రపురం మండలం ఉండేది. తర్వాత రామభద్రపురం మండలాన్ని బొబ్బిలి నియోజకవర్గంలో విలీనం చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో ఉండే మెంటాడ మండలం, పార్వతీపురం నియోజకవర్గంలో ఉండే మక్కువ మండలం.. సాలూరు నియోజకవర్గంలో విలీనమయ్యాయి. నియోజకవర్గంలో రాజకీయాలు పునర్విభజనకు ముందు ఒక విధంగా ఉంటే, తర్వాత మరో విధంగా మారాయి. రామభద్రపురం మండలం సాలూరు నియోజకవర్గంలో ఉన్నంత కాలం టిడిపి ఆధిపత్యం కొనసాగింది. రామభద్రపురం విడిపోయిన తర్వాత టిడిపికి ప్రతికూల పవనాలు మొదలయ్యాయి. 2009 తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా టిడిపి అభ్యర్థుల ఓటమి కనిపించింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌, వైసిపి అభ్యర్థుల విజయపరంపర కొనసాగుతోంది. 1952లో జరిగిన ఎన్నికల్లో కృషికార్‌ లోక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కూనిశెట్టి వెంకటనారాయణ దొర మొదటి ఎమ్మెల్యే అయ్యారు. 1955 ఎన్నికల్లో అల్లు ఎరుకునాయుడు ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1962లో ఎల్‌.ఎన్‌.సన్యాసిరాజు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ ఎమ్మెల్యే అయ్యారు. 1967లో గిరిజన నాయకుడు ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసిన బోయిన రాజయ్య ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1972లో గిరిజన నాయకుడు జన్ని ముత్యాలు కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 1978లో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్‌ఆర్‌టిపి వీరపరాజు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. నియోజకవర్గం చరిత్రలో మొదటి సారి కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగిరింది. 1982లో టిడిపి ఆవిర్భావం తర్వాత కొంతకాలం విజయపరంపర కొనసాగింది. 1983లో, 1985లో బోయిన రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్‌టిఆర్‌ ప్రభుత్వంలో రాజయ్య గిరిజన సంక్షేమ శాఖ ఉపమంత్రిగా పని చేశారు. 1989లో ఎల్‌.ఎన్‌.సన్యాసి రాజు కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌పి భంజ్‌దేవ్‌ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో భంజ్‌దేవ్‌ చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజన్నదొర ఓటమి పాలయ్యారు. తర్వాత భంజ్‌దేవ్‌ ఎస్‌టి కాదని పేర్కొంటూ గిరిజన నాయకుడు రాజన్నదొర హైకోర్టులో కేసు వేశారు. దీనిపై 2006లో హైకోర్టు తీర్పు నేపథ్యంలో భంజ్‌దేవ్‌ ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. రాజన్నదొర ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు కోర్టు తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజన్నదొర విజయ దుందుభి కొనసాగుతోంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌, వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన రాజన్నదొర.. సంధ్యారాణి, భంజ్‌దేవ్‌పై గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసిపి తరపున మరోసారి పోటీ చేసి రాజన్నదొర విజయం సాధించారు. సాలూరు నియోజకవర్గం నుంచి రాజన్నదొర నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదో సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సంధ్యారాణి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజన్నదొర పోటీచేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యనే పోటీ ఏర్పడింది. ఇక్కడ త్రిముఖపోటీ ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్‌ ఎస్‌టి ఎమ్మెల్యేగా రాజన్నదొరకు డిప్యూటీ సిఎం పదవి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కింది. గిరిజన ఎమ్మెల్యేల్లో డిప్యూటీ సిఎం స్థాయి పదవిని చేపట్టిన మొదటి ఎమ్మెల్యే రాజన్నదొరే కావడం విశేషం. 1985లో టిడిపి ప్రభుత్వ హయాంలో బోయిన రాజయ్య గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ మంత్రిగా పని చేస్తే.. 2019 ఎన్నికల్లో గెలిచిన పీడిక రాజన్నదొర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, డిప్యూటీ సిఎంగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

➡️