విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం : విద్యాసంస్థలు

రాయదుర్గం (అనంతపురం) : జులై 4న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ, ఏ ఐ ఎస్‌ ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, పి డీ ఎస్‌ యు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ ఎన్‌ ఎస్‌ యు ఐ జిల్లా నాయకుడు అనిల్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి బంద్‌ కు సంబంధించిన వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యారంగాన్ని విచ్చిన్నం చేస్తున్నదని అందులో భాగంగానే కేంద్రం రాష్ట్రం విద్యా హక్కులను కాలరాస్తూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఎన్‌టిఎ లాంటి సంస్థలను రద్దు చేయాలన్నారు. నీట్‌ పరీక్షను రాసి నష్టపోయిన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నీట్‌ పరీక్ష రద్దుపై నైతికంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులపై కేసులు సరైనది కాదని, పాఠశాలలు మూసివేతలను ఆపాలని, పిహెచ్‌డి అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న పరీక్షల్లో నెట్‌ స్కోర్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్లు పెంచాలని, విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ ఎఫ్‌ ఐ నాయకులు లోకేష్‌, గౌతమ్‌, వెంకీ, ఏ ఐ ఎస్‌ ఎఫ్‌. నాయకులు కార్తీక్‌, దాదా పీర్‌, వినయ్, ఎన్‌ ఎస్‌ యు ఐ నాయకులు జోసెఫ్‌, వీరేష్‌, తదితరులు పాల్గొన్నారు

➡️