బైపాస్‌ నిర్మాణం పూర్తిలో దశాబ్ధాలుగా ఫెయిల్‌!

Jun 17,2024 23:30

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణ ప్రజలకు తీరని కలగా ఉన్న ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతోందేగాని పరిష్కారం కావడం లేదు. దశాబ్ధం కాలం క్రితం ఏర్పాటైన అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారి పూర్తయినా పిడుగురాళ్ల పరిధిలోని 5 కిలోమీటర్ల బైపాస్‌ పనులు మాత్రం ఏళ్ల తరబడి ఫెయిల్‌ అవుతూ అసంపూర్తిగానే మిగిలాయి. నాడు రహదారి కోసం భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారాన్ని మార్కెట్‌ రేటు ఆధారంగా చెల్లించాలని కోరారు. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పనులు ఆపేయాలని కోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది. 2014లో ఎమ్మెల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు భాదిత రైతులతో చర్చించారు. కొంతమందికి మార్కెట్‌ ధరతో సమానంగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుండి అందేలా చేశారు. అయినా పనులు పూర్తవ్వలేదు. అనంతరం 2019 ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. తాము గెలిస్తే బైపాస్‌ను పూర్తి చేయిస్తానని కాసు మహేష్‌రెడ్డి హామీనిచ్చారు. అందుకనుగుణంగా ఆయన ఎమ్మెల్యే అయ్యాక నష్ట పరిహారం అందని మిగిలిన రైతులకూ పరిహారాన్ని ఇప్పించారు. కాంట్రాక్ట్‌ర్‌పై ఒత్తిడి తెచ్చి బైపాస్‌ పనులను వేగవంతం చేయించారు. పిడుగురాళ్ల బైపాస్‌ పనులు పూర్తి చేయకుంటే పట్టణంలోకి వాహనాలు రానివ్వబోమని సంభందిత సంస్ధకు చెందిన టోల్‌గేట్‌ వద్ద కూడా నిరసనకు దిగారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బైపాస్‌ పూర్తి చేయటానికి రైల్వేబ్రిడ్జి పనులు ఒకవైపున తాత్కాలికంగా రోడ్డుకు ఒక వైపున పూర్తి చేసి వాహన రాకపోకలకు అనుమతిచ్చారు. రెండోవైపున త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నికలు ముగిసేంత వరకూ బైపాస్‌పై వాహనరాకపోకలు అధికారులు అనుమతించారు. ఎన్నికల అనంతరం బైపాస్‌ పనులింకా పూర్తవ్వాల్సి ఉందంటూ వాహనాల రాకపోకలను నిలిపేశారు. దీంతో వాహనాలు తిరిగి పట్టణంలో నుండి రావడంతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలంగా మారింది. పెద్దపెద్ద కంటైనర్‌ లారీలు, వేలాది వాహనాలు వస్తుండటం, హైదరాబాద్‌ నుండి చెన్నై, గుంటూరు వెళ్లే వాహనాలు ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉండడంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌ చిక్కులు నిత్యం సమస్యగా మారుతున్నాయి. తాజా ప్రభుత్వమైనా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️