ఎన్నికల బరి.. తగ్గేదేలే మరి!

May 9,2024 20:57

ప్రజాశక్తి-విజయనగరం కోట :   జిల్లాలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. ప్రచారానికి రెండు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రతిచోటా హోరాహోరీ తప్పదన్న పరిస్థితి నెలకొనడంతో ఒక్క నిమిషాన్నీ అభ్యర్థులు వృథా చేయడం లేదు. గెలుపోటములను ప్రభావితం చేసే ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అయితే కొన్ని చోట్ల ఉద్దండులు బరిలో దిగితే, మరికొన్ని నియోజకవర్గాల్లో యువ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా అందరూ మండుటెండలో ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉద్దండులతో సహా యువ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. కొన్నిచోట్ల ఉద్దరడుల మధ్య సమరం సాగుతుంటే, ఇంకొన్ని చోట్ల సీనియర్లు, యువ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజకీయ ఉద్దండులు నిలయంగా ఉన్న ఈ జిల్లాలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా పని చేసిన అనుభవాలతో ఈ సారి ఎన్నికల్లో వ్యూహం రచిస్తున్నారు. నాలుగైదు సార్లు విజయం సాధించిన వారితో పాటు కొత్తగా తొలిసారి బరిలో దిగిన అభ్యర్థులూ ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 11 స్థానాల్లో 106 మంది పోటీఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో 106 మంది వివిధ పార్టీల నుంచి బరిలోకి ఉన్నారు. విజయనగరం, రాజాం, చీపురుపల్లి బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట ఈ ఏడు నియోజకవర్గాల్లో 77 మంది బరిలో ఉండగా పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ ఈ నాలుగు నియోజకవర్గాల్లో 29 మంది బరిలో ఉన్నారు. విజయన ‘గరం గరం’విజయనగరం జిల్లా కేంద్రంలో ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. వైసిపి నుంచి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, టిడిపి కూటమి నుంచి మాజీ కేంద్ర మంత్రి కుమార్తె పూసపాటి అదితి గజపతిరాజు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బరిలో ఉన్నారు. వీరభద్ర స్వామి వైసిపిలోకి రాకముందు 2004లో ఒకసారి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. వైసిపి తరుపున 2014లో ఆయన పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.ఆయనపై టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన మీసాల గీత గెలుపొందారు. 2019లో అదితి గజపతిరాజుపై సుమారు 5వేల ఓట్లతో కోలగట్ల విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి వీరి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చీపురుపల్లిలో ఉద్దండుల పోటీచీపురుపల్లి నియోజకవర్గం బరిలో ఉద్దండులు బరిలో ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసిపి నుంచి మంత్రి బొత్స సత్యనారాయ, టిడిపి కూటమి నుంచి మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పోటీ పడుతున్నారు. కళావెంకటరావు టిడిపి నుంచి ఇప్పటి వరకూ 5 సార్లు విజయం సాధించారు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఒకసారి ఎమ్‌పిగా, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, వైసిపి నుంచి ఒక సారి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. వీరిద్దరూ ఇప్పుడు బరిలో ఉండటంతో తీవ్రమైన పోటీ నెలకొంది. ఎస్‌కోట ఎవరిది?జిల్లా మహిళా నాయకుల్లో సీనియర్‌గా గుర్తింపు పొందిన కోళ్ల లలిత కుమారి టిడిపి కూటమి తరుపున బరిలో ఉన్నారు. తన తాత కోళ్ల అప్పలనాయుడు వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆమె టిడిపి నుంచి విజయం సాధించారు. ఈమెపై ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో పోటీ పడుతున్నారు. వీరిద్దరూ 2019లో ఒకసారి పోటీ పడగా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి పోటీ పడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైద్యులు గేదెల తిరుపతిరావు కూడా బరిలో ఉండి వీరికి ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ‘రాజా’ం ఎవరు?రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి కోండ్రు మురళీ టిడిపి కూటమి తరుపున బరిలో ఉన్నారు. ఈయన 2004, 2009లో కాంగ్రెస్‌ తరుపున విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. ఆయనపై మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య కుమారుడు డాక్టర్‌ తలే రాజేష్‌ వైసిపి తరుపున బరిలో దిగారు. ఈయనకు ఇదే తొలిసారి ఎన్నిక కావడంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కోండ్రు మురళీ సీనియర్‌ కావడంతో వ్యూహంగా ముందుకు వెళుతున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలు వైసిపి, టిడిపి మధ్యనే గట్టి పోటీ ఉండగా కాంగ్రెస్‌ తరుపున కంబాల రాజవర్థన బరిలో ఉన్నారు. బొబ్బిలిలో రాజకీయ యుద్ధం బొబ్బిలిలో వైసిపి, టిడిపిల మధ్య గట్టి పోటీ నెలకొంది. వైసిపి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకులు శంబంగి వెంకటచినప్పలనాయుడు, టిడిపి నుంచి బొబ్బిలి రాజు బేబినాయన బరిలో ఉన్నారు. అప్పలనాయుడు ఇప్పటికే వివిధ పార్టీల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు ఐదోసారి కూడా విజయం సాధించాలని భావిస్తున్నారు. ఈయనకు పోటీగా గతంలో మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన బేబినాయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య కాంగ్రెస్‌ నుంచి మరిపి విద్యాసాగర్‌ పోటీ పడుతున్నారు. గజపతినగరంలో కొత్త ముఖం గజపతినగరం రాజకీయాల్లో బొత్స కుటుంబం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ బొత్స అప్పలనర్సయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హేట్రిక్‌ కొట్టేందుకు తహతహలాడుతున్నారు. టిడిపి కూటమి నుంచి కొండపల్లి శ్రీనివాస్‌ బరిలోకి దిగారు. శ్రీనివాస్‌ చిన్నాన కొండపల్లి అప్పలనాయుడు అదే నియోజకవర్గంలో టిడిపి నుంచి 2014లో విజయం సాధించారు. ఆ స్ఫూర్తితో కొండపల్లి శ్రీనివాస్‌ తొలిసారి కూటమి తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాలు కొత్త అయినప్పటికీ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ తరుపున డోల శ్రీనివాస్‌ వీరితో పోటీ పడుతున్నారు.నెల్లిమర్లలో గెలుపెవరది?ఈ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైసిపి నుంచి బరిలో ఉన్నారు. ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హేట్రిక్‌ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన తరుపు నుంచి లోకం నాగమాధవి బరిలో ఉన్నారు. ఆమె 2019లో ఒకసారి పోటీ పడి ఓటమి చెందారు. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ రెండోసారి పోటీ పడుతున్నారు. కూటమి అభ్యర్థి కావడంతో ఆయనకు గట్టి పోటీ ఇస్తోంది. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సరగడ రమేష్‌ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పార్వతీపురంలో తొలిసారిపార్వతీపురం మన్యం జిల్లాలో టిడిపి కూటమి అభ్యర్థిగా బోనెల విజయచంద్ర బరిలో దిగుతున్నారు. ఈయన మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈయనపై వైసిపి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొందని స్థానికులు చెబుతున్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ తరుపున బత్తిన మోహన్‌రావు కూడా పోటీ పడుతున్నారు. సాలూరులో హేమాహేమీలుసాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర వైసిపి నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఈయన ఇప్పటికే 4సార్లు విజయం సాధించారు. ఇప్పుడు ఐదోసారి కూడా విజయం సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈయనపై కూటమి నుంచి సీనియర్‌ మహిళా నాయకులు గుమ్మడి సంధ్యారాణి పోటీ పడుతున్నారు. ఈమె కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. వీరిద్దరూ సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉండటంతో వీరిద్దరి మద్య గట్టిపోటీ ఉన్నట్లు తెలిస్తోంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మువ్వల పుష్పారావు బరిలో ఉన్నారు. కురుపాంలో త్రిముఖ పోటీకురుపాం నియోజకవర్గంలో ఇప్పటికే రెండుసార్లు వైసిపి ఎమ్మెల్యేగా విజయం సాధించి డిప్యూటీ సిఎంగా పనిచేసిన పుష్పశ్రీవాణి మూడోసారి పోటీలో ఉన్నారు. టిడిపి అభ్యర్థిగా తోయక జగదీశ్వరి నిలిచారు. వీరిద్దరితో పాటు మరో బలమైన అభ్యర్థిగా సిపిఎం నుంచి మండగి రమణ పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. పాలకొండలో ద్విముఖ పోటీపాలకొండలో ద్విముఖ పోటీ నెలకొంది. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే కళావతి వైసిపి తరుపున మరోసారి బరిలో ఉన్నారు. ఈమెకు పోటీగా జనసేన నుంచి నిమ్మక జయకృష్ణ బరిలో దిగారు. కళావతి ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించగా ఆమె చేతిలో రెండు సార్లూ నిమ్మక జయకృష్ణ ఓటమి చెందారు. మూడోసారి విజయం సాధించాలని ఆమె, ఈసారైనా విజయం సాధించాలని జయకృష్ణ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సవర చంటిబాబు బరిలో ఉన్నారు.

➡️