రాక్షస పాలనకు చివరి గడియలు

May 2,2024 21:44

ప్రజాశక్తి-విజయనగరం కోట: రాష్ట్రంలోని రాక్షస పాలనకు చివరి గడియలు దగ్గరపడ్డాయని విజయనగరం టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం 16వ డివిజన్‌లో గల అంబటి సత్రం, అశోక్‌ నగర్‌, రింగ్‌ రోడ్డు జంక్షన్‌ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు అవనాపు భార్గవి పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలనకు అంతిమరోజులు దగ్గరపడ్డాయని, రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని అన్నారు, అయిదేళ్ల వైసిపి పాలనలో అభివృద్ధిలో 30ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు, పరిపాలన చేతకాని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్నారు, ముఖ్యంగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు తీసుకువచ్చి మన యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కృషి చేశారన్నారు. కానీ అదే సమయంలో అధికారంలో వచ్చిన జగన్‌ ప్రభుత్వం వచ్చిన కంపెనీలను వెనక్కి తరిమేశారని తెలిపారు. మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు.టిడిపిలో భారీగా చేరికలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సమక్షంలో 3వ డివిజన్‌ వైసిపి నాయకులు, కార్పొరేటర్‌ వజ్రపు సత్యగౌరి, వజ్రపు శ్రీనివాసరావు, జి. రమణ, బర్నాల సంతోష్‌, దువ్వు శ్రీనుతో పాటు 500 కుటుంబాలు టిడిపిలో చేరాయి. 37వ డివిజన్‌ కు చెందిన మాజీ కౌన్సిలర్‌ మజ్జి బాబు, పడగల రమణ, మజ్జి రమేష్‌, మజ్జి శ్రీనివాసరావు తో పాటు 400 కుటుంబాలు చేరాయి. బడుకొండ పేట గ్రామానికి చెందిన వైసిపి నాయకులు, వార్డు మెంబర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

➡️