భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దుచేయాలి

Jul 2,2024 00:39 #News rules, #nirasana
Law New rules nirasana

ప్రజాశక్తి- యంత్రాంగం విశాఖ కలెక్టరేట్‌ : భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా, విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్‌ 106 (1) (2) ప్రకారం యాక్సిడెంట్‌ కేసులలో డ్రైవర్లకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారని తెలిపారు. డ్రైవర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అసలు ప్రమాదాలకు కారణాలను పరిశీలించకుండా, నివారణ చర్యలు చేపట్టకుండా డ్రైవర్లనే పూర్తి బాధ్యత చేయడం సరి కాదన్నారు. మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జి.అప్పల రాజు మాట్లాడుతూ, మోటార్‌ కార్మికులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తేవడం దుర్మార్గ మన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. పరవాడ : భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పరవాడ మండలం లంకెలపాలెం కూడలిలో ఆటో రిక్షా కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎస్‌ గోవిందు, కె.అప్పారావు, ఎన్‌ ముసిలి, డి మధు, వై నాగేష్‌, ఎస్‌ సన్యాసిరావు, రాంబాబు పాల్గొన్నారు.

➡️