ఆఖరి రోజు ప్రచార హోరు

May 11,2024 21:34

 ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్నికల ప్రచారాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు హోరెత్తాయి. ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగియడంతో వైసిపి, టిడిపి పోటాపోటీగా ప్రచారం చేశాయి. పట్టణంలోని పలు వార్డుల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనకు మద్దతుగా ఆయన సోదరుడు రామ్‌నాయన, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు మద్దతుగా పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, మాజీ చైర్‌పర్సన్‌ తూముల అచ్యుతవల్లి, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. టిడిపి అభ్యర్థి బేబినాయన, వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు గ్రామాల్లో వేర్వేరుగా ఎన్నికల ప్రచారం చేసి మేనిఫెస్టోను వివరించి ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మరిపి విద్యాసాగర్‌ గ్రామాల్లో తమ మద్దతుదారులతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి సమయం ముగియడంతో ప్రలోభాలకు ప్రయత్నం చేస్తున్నారు.

ఆఖరి రోజు ప్రచార హోరు

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

రామభద్రపురం : అభివృద్ధి, సంక్షేమమే కూటమి ధ్యేయమని టిడిపి విజయనగరం ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన తెలిపారు. మండలంలోని కొట్టక్కి గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. వైసిపి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్తు, ఆర్‌టిసి, బస్సుఛార్జీలు, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటాయని చెప్పారు. దీంతో సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు ముల్లు రాంబాబు, జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, నాయకులు బెవర సీతారాం, వంగపండు అప్పలనాయుడు, గొర్లె రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️