ఆఖరి రోజు హోరెత్తిన ప్రచారం

May 11,2024 20:52

ప్రజాశక్తి- చీపురుపల్లి : ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఇరు పార్టీలు శనివారం తమ ప్రచారాన్ని తారా స్థాయికి తీసుకెల్లాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో అభ్యర్థుల తరుపున తమ నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. పార్టీల నాయకులు ఎవరికి వారే మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులతో పాటు కార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని నింపారు. ఒకరికి మించి మరొకరు పై చేయి సాధించేలా ఓట్లు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. వైసిపి మండల కేంద్రంలో సుమారు ఐదు వేల మందితో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా పార్టీ అద్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసరావు, మండల పార్టీ అద్యక్షుడు ఇప్పిలి అనంతం, యువజన విభాగం జిల్లా ఉపాద్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ ఓటును రాబట్టేందుకు, ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు హామీల వర్షం కురిపించారు. టిడిపి తరుపున కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి, గరివిడి పట్టణాలలో భారీ ర్యాలీలు చేపట్టారు. చీపురుపల్లిలో టిడిపి, వైసిపి, బిఎస్‌పి, కాంగ్రేస్‌ పార్టీలతో మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో ఉన్నప్పటికీ టిడిపి, వైసిపిల మద్యే ప్రధానమైన పోటీ జరుగుతోంది. తమ సిట్టింగ్‌ సీటుని కాపాడుకునేందుకు వైసిపి అభ్యర్థి ప్రస్తుత విద్యాశాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణ శ్రమిస్తున్నారు. గతంలో ఎచ్చెర్లలో పోటీ చేసి ఓడిపోయిన కిమిడి కళావెంకటరావు ఈసారి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా చీపురుపల్లి నుంచి గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎవరికి వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రచారం చివరి రోజు కావడంతో అభ్యర్ధులు తమ అంతరింగుకులతో లోటు పాట్లుపై సమాలోచనలు జరుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చీపురుపల్లి నియోజక వర్గంలో వైసిపి, టిడిపిల మద్య గట్టి పోటీ జరుగుతోంది. ఈ పోటీలో పై చేయి సాధించేందుకు రెండు పార్టీలు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులపై అంచ నాలు వేస్తున్నారు. ఇతర పార్టీల నాయకుల్లో చీలికల తీసు కొచ్చి తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.డబ్బులు, మద్యం పంపిణీ చేస్తారాగత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ప్రస్తుత జరుగుతున్న ఎన్నికలలో డబ్బులు, మద్యం పంపిణీ చేస్తారా..లేదా అని ప్రజలు గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఏ ఒక్కరి నోట విన్న ఇదే మాట వస్తోంది. నలుగురు కలిసిన ప్రతీ చోట ఎన్నికలపై మాట్లాడుతూ నేటి నుండే డబ్బు మద్యం వస్తాయంటూ చర్చించుకుంటున్నారు. దీనిని బట్టి చూస్తే పంపిణీ ఎవరైతే ఎక్కువ చేస్తారో వారికి గెలుపు అవకాశాలు ఉంటాయనేది అర్ధమవుతుంది. ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. ఎన్నికల్లో పై చేయి ఎవరు సాధిస్తారో తెలియాలంటే ఈ నెల 13 వరకు వేచి చూడాల్సిందే.ఓటు సంక్షేమానికా..? చేరికలకా..?ప్రజాశక్తి- మెరకముడిదాంచీపురుపల్లి నియోజకవర్గంలోని కీలకమైన మండలంగా మెరకముడిదాంకు గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకైనా గెలుపును డిసైడ్‌ చేసే మండలంగా పేరుంది. ఈ మండలంలో మొత్తం 46,869 ఓటర్లున్నారు. ఇటువంటి కీలకమైన మండలంలో వైసిపి నుంచి టిడిపిలో పలువురు చేరిపోవడంతో వైసికి నష్టజరిగే అవకాశం ఉందని టిడిపి నాయకులు అంచనా వేస్తున్నారు. అయితే సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారన్న దీమాతో వైసిపి పెద్దలు ప్రచారం చేస్తున్నారు. మండలంలోని చినబంటుపల్లికి చెందిన మాజీ ఎంపిపి, వైసిపి నాయకులు కోట్ల మోతిలాల్‌ నాయుడు టిడిపిలోకి చేరారు. గర్భాం మేజర్‌ పంచాయతీకి చెందిన మాజీ ఎంపిపి తాడ్డి కృష్ణారావు కుమారుడు తాడ్డి చంద్ర శేఖర్‌ వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లారు. దీని వల్ల మండలంలో కొంతవరకు వైసిపికి నష్టం అయినప్పటికీ వీరంతా వైసిపి నాయకులు బొత్స సత్యనారాయణ వర్గీయులే కావడంతో ఓటు తమకే వేస్తారన్న దీమాతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బొత్సకు అడ్డాగా ఉన్న ఈ మండలంలో ఈ సారి చేరికలు కలకలం రేపాయి. గత ఎన్నికల్లో ఈ మండలం నుంచి 9 వేలకు పైగా వైసిపికి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ మండలం నుంచి ఆయనకు గత ఎన్నికలలో వచ్చిన మెజారిటీ కంటే తక్కువ వచ్చినా విజయం సాధిస్తాడన్న దీమాతో ఉన్నారు. అయితే టిడిపిలో చేరికతో పాటు కూటమి అభ్యర్థి కూడా బలమైన నాయకుడు కావడంతో ఈ సారి గట్టి పోటీ నెలకొందన్న వాదన వినిపిస్తోంది.

➡️