ఉచితాల మంత్రం.. రాజకీయ తంత్రం

May 4,2024 21:23

 ప్రజాశక్తి- విజయనగరం డెస్క్‌  : గతంలో ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలతో తమ పిల్లలకు ఉద్యోగవకాశాలొస్తాయని, ఉపాధి దొరుకుతుందని, ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తారని ఆశతో ప్రజలు ఎదురు చూసేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఉచితాల మూటను భుజాన ఎత్తుకుని ప్రచారంలోకి దిగాయి. ఇటు టిడిపి గానీ, అటు వైసిపి గానీ ప్రజలకు ఇస్తున్న హామీల్లో ఉచితాలు తప్ప ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకటించలేదు. ఇదే సందర్భంలో ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు మాత్రం తాము ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటాలను వివరిస్తూ తమను గెలిపిస్తే హక్కులను, చట్టాలను రక్షించుకోవడంతో పాటు అనేక సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ, పార్లమెంట్‌లో గళమెత్తుతామని ప్రకటిస్తున్నారు. ఇటీవల టిడిపి-జనసేన కూటమి, వైసిపి ప్రకటించిన మేనిఫెస్టోలో పప్పు బెల్లం పంచినట్లు ఉచిత పథకాలను ఊదరగొట్టారే తప్ప ప్రజాసమస్యల ఊసే లేదు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏవేవి ఉచితంగా ఇస్తామో చెప్పారు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గాని, ప్రాజెక్టులు గురించి గాని, ప్రజలపై పడుతున్న భారాలను తొలగిస్తామని గాని, పన్నులు పెంచబోమని గాని ప్రకటించలేదు. దీన్ని బట్టి పేద, మధ్య తరగతి ప్రజల పట్ల ఆ పార్టీల వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. డిఎస్‌సిపై తొలిసంతకం పెడతామని టిడిపి ప్రకటించడం మినహా మిగతా పోస్టుల ఊసే లేదు. అధికారంలోకి వస్తే ఎంత డబ్బు పంచుతామో చెబుతున్నారే తప్ప తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం, ప్రాజెక్టులు నిర్మించి రైతుకు సకాలంలో సాగునీరందిస్తాం, పిల్లలకు మంచి విద్యను అందిస్తాం, ఆస్పత్రిల్లో మెరుగైన వైద్యం అందిస్తామన్న హామీలను ఇవ్వలేదు. దీంతో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, వారు కొమ్ముకాస్తున్న బిజెపి నాయకులపై ప్రజలకు ఆశలు సడలిపోతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇటు టిడిపి, అటు వైసిపి రెండు పార్టీలూ తీవ్రమైన అన్యాయం చేశాయి. గత ఐదేళ్లలో వైసిపి, అంతకుముందు టిడిపి జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. తోటపల్లి, తారకరామతీర్థ సాగర్‌, మెంటాడ మండలంలోని గుర్ల గెడ్డ వంటి ప్రాజెక్టులు, ఏజెన్సీలోని గుమ్మడిగెడ్డ, వట్టిగెడ్డ ఇలా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. దశాబ్ధకాలంలో టిడిపి, వైసిపి అధికారం చేపట్టినా ఎవరూ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. దీంతో రైతులకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా జిల్లాలో ఉన్న పరిశ్రమలు మూతపడి పోవడం, పనిచేస్తున్న పరిశ్రమల్లో సామర్థ్యం లేకపోవడంతో కార్మికులు వలస బాట పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే మూతపడిన పరిశ్రమలను తెరిస్తామన్న వైసిపి నాయకుల మాటలు కార్యరూపం దాల్చలేదు. భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మూతపడి పోయింది. దీంతో ఆ ప్రాంతంలో చెరుకు సాగు తగ్గిపోయింది. ఉన్న పరిశ్రమలను తెరిపించలేని పార్టీలు కొత్త పరిశ్రమలను ఏం తీసుకొస్తాయని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీనికి తోడు జిల్లాకు రావాల్సిన విభజన హామీలను రాబట్టడంలోనూ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇస్తామన్న నిధులను తెచ్చుకోవడంలో చతికిలబడ్డారు. గిరిజన విశ్వ విద్యాలయం, రైల్వే జోన్‌ వంటి అంశాలను సాధించుకోలేకపోయారు. వీటిపై టిడిపి, వైసిపి నాయకులు మాట్లాడకుండా తాము అధికారంలోకి వస్తే అమ్మఒడిస్తాం, గ్యాస్‌ ఉచితంగా ఇస్తాం, మహిళలకు డబ్బులు పంచుతామనే ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపించడంతో ఇప్పటికే జిల్లాలో రాజకీయం వేడెక్కింది. వైసిపి, టిడిపి అధినేతలు ఒకటికి రెండుసార్లు ప్రచారంలో భాగంగా జిల్లాను చుట్టేశారు. అయితే వీరి ఉపన్యాసాల్లో ఎక్కడా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని గానీ, పరిశ్రమలు తీసుకొస్తామని గాని చెప్పకుండా కేవలం ఉచితాల మంత్రంతోనే రాజకీయాలను రంజింప చేస్తున్నారు. ఏ సభలో కూడా చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ఊసెత్తడం లేదు. సభ ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రత్యర్థి చేసిన మోసాలనే చెబుతూ చివరిలో ఉచితాల వర్షం కురిపించి సభను రక్తికట్టించి ముగించేస్తున్నారు. దీంతో నాయకుల మాటల్లో ప్రజలకు భరోసా కల్పించడం లేదు. ఎవరు వచ్చినా ఏమీ చేయరన్న అంచనాకు ప్రజలు వచ్చేసినట్లు చర్చ జరుగుతోంది.

➡️