రసవత్తరం.. మాడుగుల రాజకీయం!

మాడుగుల రాజకీయం!

పోటీ అభ్యర్థులను ప్రకటించి, మార్చిన ప్రధాన పార్టీలు

ఫలితాలను ప్రభావితం చేసేలా రాజకీయ పరిణామాలు

మాట వరసకైనా ప్రధాన సమస్యలను ప్రస్తావించని నేతలు

కె.కోటపాడు : మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన పార్టీలు ముందుగా ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేయడం, వైసిపి అభ్యర్థికి ఇంటిపోరు, టిడిపిలో గ్రూపుల గోల.. ఇలా ప్రతి పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికల ఎజెండాగా మారాల్సిన నియోజకవర్గంలోని ప్రధాన ప్రజాసమస్యలన్నీ మరుగున పడిపోయాయి. దేశం, రాష్ట్రంలోని పరిస్థితుల ప్రస్తావన కన్నా, స్థానిక రాజకీయాల చుట్టూ అంతా తిరుగుతూ, ఎవరు ఎటువైపు ఉన్నారు? ఎవరు, ఎవరికి ఓటేస్తారు? ఎవరు గెలుస్తారు? అనే దానిపైనే అంతా ఫోకస్‌గా ఉంది.

మాడుగుల నియోజకవర్గంలో ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా ఉన్నాయి. నోటిఫికేషన్‌ దగ్గర నుంచి అభ్యర్థుల ప్రకటన, నామినేషన్లు దాఖలు, ఉపసంహరణ వరకు అన్నింటా ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు. చివరకు పోటీలో తొమ్మిది మంది అభ్యర్థులు నిలవగా, ప్రధాన పోటీ వైసిపి, కూటమి బలపరిచిన టిడిపి మధ్యే ఉన్నట్లు భావిస్తున్నా, మేమున్నామంటూ మూడో ప్రత్నామ్యాయంగా ఇండియా బ్లాక్‌ బలపరిచిన కాంగ్రెస్‌ పోటీ బరిలో ఉంది. ఇక ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి అభ్యర్థులను ప్రకటించడం, కారణాలేవైనా వారిని మార్పుచేయడం జరిగింది. సిటింగ్‌ ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి వైసిపి తరపున మూడోసారి పోటీలో నిలవడం ఖాయమని తొలుత భావించినా, పార్టీ అధిష్టానం అతనిని అనకాపల్లి ఎంపీ స్థానంలో పోటీలో నిలిపి, బూడి కుమార్తె ఈర్లె అనురాధకు వైసిపి టిక్కెట్‌ ఖరారు చేసింది. ఇక టిడిపిలోనూ ఊహించని పరిణామాలే చోటుచేసుకున్నాయి. టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌, సీనియర్‌ నేత పైలా ప్రసాదరావు టిక్కెట్‌ ఆశించగా, పైలాకు అధిష్టానం టిక్కెట్‌ ఖరారు చేయడం, ఆయన ప్రచారంలో దిగడం చకచకా జరిగిపోయాయి. అయితే గవిరెడ్డి రామానాయుడు, పివిజి.కుమార్‌ నుంచి వ్యతిరేకత రావడంతో పైలా ప్రసాదరావును తప్పించి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టిడిపి అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చింది. దీంతో రెండు పార్టీల్లో కేడర్‌ అయోమయంలో పడక తప్పలేదు. ఇక ఇండియా బ్లాక్‌ బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డు శ్రీనివాసరావు మూడో ప్రత్యామ్నాయంగా పోటీలో ఉన్నారు. వామపక్షాలు, ఇండియా ఫోరంలోని ఇతర పార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో ముందుకు సాగుతున్నారు

.వైసిపికి ఇంటిపోరు.. అసమ్మతి జోరు

మాడుగుల టిక్కెట్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు ఇస్తే హ్యాట్రిక్‌ విజయం ఖాయమని భావిస్తున్న తరుణంలో అతనిని తప్పించి బూడి కుమార్తె, కె.కోటపాడు జెడ్‌పిటిసి ఈర్లె అనురాధకు కేటాయించడం వైసిపికి నష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే తరుణంలో బూడికి ఇంటిపోరు కూడా తోడై ఆయన కుమారుడు బూడి రవికుమార్‌ ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచి, తన తండ్రి కంటే తానే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తానంటూ వ్యతిరేక ప్రచారం మొదలెట్టారు. దీనికితోడు దేవరాపల్లిలో పార్టీకి పట్టున్న నాయకులు మాజీ ఎంపిపి కిలపర్తి భాస్కరరావు, ఆయన సతీమణి ఎంపిపి కిలపర్తి రాజేశ్వరి, మారేపల్లికి చెందిన సీనియర్‌ నాయకులు ఆవుగడ్డ రామూర్తినాయుడు వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరడం, కె.కోటపాడు మండలంలో మాజీ సర్పంచ్‌, డిసిసిబి డైరెక్టర్‌, గొండుపాలెం మాజీ సర్పంచ్‌ బండారు రామస్వామిపాత్రుడు వైసిపిని వీడడం జరిగింది. దీంతో అంతా అనుకూలంగా ఉన్న వైసిపికి గడ్డు పరిస్థితి ఎదురైందని భావిస్తున్నారు. బూడి కుమార్తె ఈర్లె అనురాధకు టిక్కెట్‌ ఇవ్వడం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని అంటున్నారు.

నివురుగప్పిన నిప్పులా టిడిపిలో గ్రూపులు

మరోవైపు టిడిపికి మాడుగులలో పరిస్థితులు ఏమంత సాఫీగా లేవు. ముగ్గురు ఆశావహుల్లో ఒక్కరైన పైలా ప్రసాదరావుకు టిక్కెట్‌ కేటాయించడం తర్వాత మిగిలిన ఇద్దరు అసమ్మతి, సహాయ నిరాకరణతో అనివార్య పరిస్థితుల్లో పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణమూర్తిని తీసుకొచ్చి బరిలో నిలపడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. తమలో తాము సహకరించకపోయినా, ప్రత్యామ్నాయంగా వచ్చిన బండారుకు అందరూ సహకరిస్తున్నట్లు కనిపించడంతో పరిస్థితి సద్దుమణిగేలా ఉన్నా, చివరికి ఏం జరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్న మాడుగుల నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్‌ ఘర్షణ వాతావరణానికి కారణమవు తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల బూడి స్వగ్రామం తారువలో చోటుచేసుకున్న ఘర్షణ, కె.కోటపాడు మండలం చౌడువాడలో వైసిపి వాహనాల అడ్డగింత తదితర పరిణామాలు మాడుగుల ఎన్నికల రాజకీయాల్లో కొత్త పరిణామమని చెప్పక తప్పదు. ఇవన్నీ సిఎం రమేష్‌ ఫ్యాక్షన్‌ రాజకీయాల వల్లే జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కూటమిపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనన్న ఆందోళన కూడా కేడర్‌లో ఉంది. ప్రజా సమస్యలే ఎజెండాగా ఇండియా బ్లాక్‌ ప్రచారంఇక మాడుగుల నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఇండియా బ్లాక్‌ ప్రజా సమస్యలు, గత ప్రభుత్వాల వైఫల్యాలే అజెండాగా ప్రచారం సాగిస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాసరావుకు మద్దతుగా సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ప్రచారం చేస్తున్నాయి.

మరుగున పడిన ప్రజాసమస్యలు

మాడుగుల రాజకీయాల్లో ప్రధాన పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలతో ప్రజాసమస్యల ప్రస్తావన లేకుండా పోయింది. నియోజకవర్గంలోని ఏడు ప్రధాన డ్యామ్‌లు నిర్వహణ, మరమ్మతులకు నోచుకోక ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉన్నా ఈ విషయాన్ని పట్టించుకునే దిక్కులేదు. రైవాడ రిజర్వాయర్‌ కింద ఆరువేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీటి స్థిరీకరణ చేయాల్సి ఉన్నా, దాని ఊసెత్తే వారే కరువయ్యారు. కూరగాయలు, మామిడి పంటలను ఎక్కువగా సాగుచేసే మెట్టు ప్రాంతమున్న కె.కోటపాడులో పంట ఉత్పత్తుల నిల్వకు కోల్ట్‌స్టోరేజీ ఏర్పాటు ప్రతిపాదన ఇప్పటివరకు ఒక్కడుగైనా ముందుకు వేయకపోగా, ప్రస్తుతం దీనిపై చర్చించే నాధులే లేకుండా పోయారు. దేవరాపల్లి, చీడికాడ, వి.మాడుగుల మండలాల్లోని నాన్‌షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంతంలో చేర్చి, అనకాపల్లి జిల్లాలో ఐడిడిఎను నెలకొల్పడమో, లేకుంటే పాడేరు ఐటిడిఎలో విలీనం చేయడం ద్వారా గిరిజనులకు ప్రభుత్వ ప్రయోజనాలు, సంక్షేమ పథకాలను అందించాలన్న ప్రతిపాదనపై ప్రధాన పార్టీలు మాట్లాడడం లేదు. ఈ సమస్యలపై వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా, ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీల హామీల్లోగానీ, అజెండాలోగానీ ఈ సమస్యకు చోటు దక్కలేదు. పోటీ అభ్యర్థులు వీరే…మాడుగుల నియోజకవర్గంలో తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగ్గా,. ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, నాలుగుసార్లు కాంగ్రెస్‌, రెండుసార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 1983 నుంచి 1999 వరకు టిడిపి తరపున రెడ్డి సత్యనారాయణ వరుసగా ఐదుసార్లు విజయం సాధించగా, గడచిన రెండు ఎన్నికల్లో వైసిపి తరపున బూడిముత్యాలనాయుడు వరుసగా గెలుపొందారు. ప్రస్తుతం టిడిపి అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి, వైసిపి తరపున ఈర్లె అనురాధ, ఇండియా బ్లాక్‌ బలపరిచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బిబి. సత్యనారాయణతోసహా మొత్తం 9మంది పోటీ బరిలో ఉన్నారు.

➡️