మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Jun 18,2024 21:27

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర నాయకులు పి.వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం యూనియన్‌ నాయకులు ఎ.జగన్మోహన్‌నావు అధ్యక్షతన ఇంజినీరింగ్‌ కార్మికుల సమావేశం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో జరిగింది. ముఖ్య వక్తలుగా హాజరైన యూనియన్‌ రాష్ట్ర నాయకులు పి .వెంకట్‌ రెడ్డి, ఎన్‌ వై నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు మాట్లాడారు. 2023 డిసెంబర్‌ 26 నుంచి జనవరి 11 వరకు జరిగిన సమ్మె సందర్భంగా ప్రతిపక్ష టిడిపి నాయకులు వచ్చి 2019 ఫిబ్రవరి 18న చంద్రబాబు తెచ్చిన జీవో ఎంఎస్‌ నెంబర్‌ 96 ప్రకారం బేసిక్‌ డిఎ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుత అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం కార్మికులకు బేసిక్‌ వేతనం, డిఎతో కలిపి రూ.25వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 9 మంది ఐఎఎస్‌ అధికారులతో వేసిన కమిటీ సిఫార్సుల మేరకు స్కిల్‌, సెమీ స్కిల్‌, అన్‌స్కిల్‌ వేతనాలు అమలకు ప్రయత్నం చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఉద్యోగులు కార్మికుల నుంచి 19 శాతం జిఎస్‌టిని వసూలు చేసే ఆప్కాస్‌ను రద్దు చేయాలని కోరారు. విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పంప్‌ హౌస్‌ కార్మికులకు కనీస వేతనాల జీవో ఎంఎస్‌ నెంబర్‌ 7 అమలు చేయాలన్నారు. 4నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లాలో సంక్రాంతి కానుక 1000 రూపాయలు ఇంజినీరింగ్‌ కార్మికులకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. 10,11 వ పి ఆర్‌సి ల్లో ఇంజినీరింగ్‌ కార్మికులకు జరిగిన అన్యాయాన్ని 12వ పిఆర్‌సిలో సవరించాలని, జీవో నెంబర్‌ 1615 ప్రకారం జీతాలు చెల్లించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్మోహన్‌రావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలపై ఈనెల24న కలెక్టర్‌కు, 25,26 తేదీల్లో మున్సిపల్‌ కమిషనర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాజు, ఆదినారాయణ, మురళి, నారాయణ రావు, రఘు, సురేషు ధనంజయ తదితరులు పాల్గొన్నారు.

➡️