టీచర్లను మైదాన ప్రాంతానికి బదిలీ చేయాలి

యుటిఎఫ్‌ రాష్ట్ర నేతలకు వినతిపత్రం ఇస్తున్న జిల్లా నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి

2023 జూన్‌ నెలలో జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో ఏజెన్సీ ప్రాంతానికి బదిలీపై వెళ్లిన సుమారు 400 మంది ఉపాధ్యాయులను తిరిగి మైదాన ప్రాంతానికి బదిలీ చేసే విధంగా కృషి చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌లకు సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లా యుటిఎఫ్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బారు మాట్లాడుతూ జిఓ నెంబరు 3 రద్దు కావడం, జీవో నెంబరు 117 అమలు కావడం వల్ల సుమారు 400 మంది ఉపాధ్యాయులు ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ అయ్యారని, వారంతా ఎన్నో ఇబ్బందులకు గురై బాధపడుతున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించిన మెగా డిఎస్‌సిలో పేర్కొన్న నేపథ్యంలో ఏజెన్సీలో పనిచేస్తున్న ఉపాద్యాయులను మైదాన ప్రాంతంలోని ఖాళీలకు బదిలీ చేసే విధంగా రాష్ట్ర నాయకులు కృషి చేయాలని కోరారు. దీనికి స్పందించిన రాష్ట్ర నాయకులు ఈ సమస్యను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టిఆర్‌ అంబేద్కర్‌, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, నాయకులు గాయత్రి, జిఎస్‌ ప్రకాష్‌, మామిడి బాబూరావు, టి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️