నీరుగారుతున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టం

ప్రజాశక్తి-త్రిపురాంతకం: పేదల కోసం ఉద్దేశించబడిన ఉపాధి హామీ చట్టం క్రమేపీ పెత్తందారుల కనుసన్నల్లోకి జారుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చి నా ఆయా పార్టీల పెత్తందారులు తమ అనుయా యులను క్షేత్ర సహాయకులుగా నియమించు కుంటున్నారు. వారు తమ అనుయాయులకు ఉపాధి పనులు కల్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పేదలకు ఉపాధి భరోసా ఇవ్వాలని ఉద్దేశంతో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ 2005 ఆగస్టు 25న ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించాలని, ఆర్థికంగా ఎంతో కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీలను దృష్టిలో పెట్టుకొని ఈ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. ఈ ఉపాధి హామీ చట్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా క్షేత్రస్థాయి నుంచి ఏపీఓ స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇది ప్రారంభ మొదటి నాళ్లలో కనిపించింది. అప్పట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల్లో అందరూ ఎస్సీ, ఎస్టీలే కనిపించారు. ఆ తరువాత ఈ ఉపాధి హామీ చట్టంపై అగ్రవర్ణ పెత్తందారుల కన్నుపడింది. కాలక్రమేణా ప్రభుత్వాలు మారినప్పుడల్లా క్షేత్ర సహాయకులను నిర్ణయించే స్థాయికి అధికార పార్టీ నాయకులు చేరుకున్నారు. దీనికి ఉదాహరణగా త్రిపురాంతకం మండలంలోని 24 పంచాయతీలలో 28 మంది క్షేత్ర సహాయకులు ఉండగా అందులో నలుగురు మాత్రమే ఎస్సీలు ఉన్నారు. ఉపాధి హామీని ప్రభుత్వాలు, నాయకులు వారి సొంత ఖజానాగా మార్చుకున్నారు. ఇది తప్పు అని తెలిసినా మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ కులంతో నిమిత్తం లేకుండా వారి అనుయాయులకే సిఫారసు చేస్తూ ఉంటే అధికారులు నోరెత్తలేని పరిస్థితి. ఉపాధి హామీ పనులు ఇలానే కొనసాగితే ఈ చట్టం నీరుగారిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అర్హులైనవారినే క్షేత్ర సహాయకులుగా నియమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలవారు కోరుతున్నారు.

➡️