అరెస్టులకు భయపడేది లేదు

Apr 6,2024 21:57

మిమ్స్‌ కార్మికులు, సిఐటియు నాయకులపై అక్రమ కేసులు రద్దు చేయాలి

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

అరెస్టులకు నిరసనగా కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని రెండు నెలలకు పైగా మిమ్స్‌ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే యాజమాన్యం, అధికారులు స్పందించకపోగా 12 మంది సిఐటియు నాయకులపైనా, మిమ్స్‌ ఉద్యోగులపైనా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం అన్యాయమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. అరెస్టులకు, కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.సిఐటియు నాయకులు, మిమ్స్‌ ఉద్యోగుల అరెస్టులకు నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యాన శనివారం కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు యాజమాన్యాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, చట్ట ప్రకారం వేతన ఒప్పందం చేయాలని, బకాయి ఉన్న డిఎలు చెల్లించాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరుతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన యాజమాన్యం కార్మికులను బెదిరించడం,పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయించడం దుర్మార్గమని అన్నారు. కేసులు పెట్టి కార్మికులను లోంగదీసు కోవాలని యాజమాన్యం చూస్తోందన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు కార్మికులు బయపడరని, మిమ్స్‌ కార్మికులకు రాష్ట్రంలో సి ఐ టి యు సంఘంలో ఉన్న పది లక్షల మంది కార్మికులు అండగా ఉన్నారని అన్నారు. మిమ్స్‌ కార్మికులు సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని తెలిపారు. తక్షణమే కార్మికులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, నాయకులు వి.లక్ష్మి, ఎ.గౌరినాయుడు, సురేష్‌, త్రినాధ్‌, ఎ.జగన్మోహన్‌, మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

➡️