ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన ఉండాలి

Apr 13,2024 21:10

ప్రజాశక్తి-శృంగవరపుకోట, విజయనగరం కోట: ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రిసైడింగ్‌ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అన్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే నివృత్తి చేసుకోవాలని ఆమె కోరారు. పిఒలకు, ఎపిఒలకు అన్ని నియోజకవర్గాల్లోనూ శనివారం శిక్షణ ఇచ్చారు. ఎస్‌.కోటలో జరుగుతున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. పిఒలు, ఎపిఒలకు అన్ని అంశాల పట్ల సమగ్ర అవగాహన ఉన్నప్పుడే, ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో పారదర్శకంగా, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. వివిధ అంశాల పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పడటానికి, ఎన్నికల కమిషన్‌ పంపించిన వీడియోలను కూడా చూడాలని సూచించారు. శిక్షణకు వచ్చిన వారితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు, చేసి వివిధ అంశాలను వివరించాలని అధికారులను ఆదేశించారు. ఓటింగ్‌ ప్రారంభించే ముందు మాకు పోల్‌ అత్యంత కీలకమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మాక్‌ పోల్‌ నిర్వహించకపోతే, ఎన్నిక రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ లో కచ్చితంగా ఉదయం 5:30కే మాక్‌ పోల్‌ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఏజెంట్ల కోసం ఉదయం 5:45 వరకు వేచి ఉండి, అప్పటికీ వారు రాని పక్షంలో మాక్‌ పోల్‌ పూర్తి చేయాలని సూచించారు. మాక్‌ పోల్‌ అనంతరం వివి ప్యాట్లను క్లియర్‌ చేయడం, సీల్‌ చేయడం, ఇవిఎంలను రీసెట్‌ చేయడం లాంటి ప్రక్రియను పూర్తి చేసిన అనంతరమే, సాధారణ ఓటింగ్‌ ప్రక్రియను మొదలు పెట్టాలని తెలిపారు. పోలింగ్‌ రోజు సమయ నిర్వహణ కీలకమని స్పష్టం చేశారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన దగ్గర్నుంచే వేగంగా ఓటింగ్‌ నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు. దీనివల్ల నిర్ణీత సమయానికి ఓటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పోలింగ్‌ అనంతరం అవసరమైన అన్ని పత్రాలను సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితులను తప్పులు జరగకూడదని, రీపోల్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పోలింగ్‌ జరుగుతున్నప్పుడు పోల్‌ డే మేనేజ్మెంట్‌ సిస్టమ్‌ యాప్‌ లో అవసరమైన వివరాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత రిసెప్షన్‌ సెంటర్‌ వరకూ అదనపు పోలింగ్‌ సిబ్బంది కూడా పిఒలతో కలిసి రావాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రాలను, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, ఇవిఎంలకోసం సిద్ధం చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ లను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌.కోట రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణ, ఐదు మండలాల ఎఆర్‌ఒలు, డిప్యూటీ తాహశీల్దారులు, సెక్టార్‌ అధికారులు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరంలోని విటి అగ్రహారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణలో పిఒలు, ఎపిఒలతో పాటు తహశీల్దార్‌ పివి రత్నం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఇన్‌ఛార్జి విజయలక్ష్మి, ఎఆర్‌ఒ సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. శిక్షణను రిటర్నింగ్‌ అధికారి కార్తీక్‌, ఇఆర్‌ఒ ఎవి సూర్యకళ పరిశీలించారు.

➡️