సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి

Apr 29,2024 20:59

 ప్రజాశక్తి – సీతానగరం : రోగనిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన స్థానిక పిహెచ్‌సిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో ఆయన మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జ్వర లక్షణాలతో అప్పుడే అక్కడకు వచ్చిన ఒక పాపకు ల్యాబ్‌ సిబ్బందిచే నిర్దారణ పరీక్షలు చేయించి వాటి ఫలితాలను పరిశీలించారు. గర్భిణులతో మాట్లాడి మాతాశిశు సంరక్షణ కార్డులో వైద్య పరీక్షల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వేసవి రీత్యా వడదెబ్బ, డీ హైడ్రేషన్‌ మొదలగు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, ఒఆర్‌ఎస్‌ అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని అన్నారు. గర్భిణీలకు, దీర్ఘ కాలిక రోగులకు సాధ్యమైనంత వరకు వారి పరిధిలోనే ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఫీవర్‌ సర్వలెన్స్‌ చేపట్టాలన్నారు. ల్యాబ్‌ రికార్డులు ఎంఎఫ్‌7, ఎంఎఫ్‌9 తనిఖీ చేశారు. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున బుద,శని వారాల్లో నిర్వహించే వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలను గ్రామాలో నిర్వహించాలన్నారు. ఆసుపత్రిలో అత్యవసర ప్రాథమిక చికిత్స సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ పావని, సిహెచ్‌ఒ ఎస్వీ రమణ, సూపర్‌వైజర్‌ భవాని, వైద్య సిబ్బంది ఉన్నారు.

➡️