కబ్జాకు గురైనప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలిరౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కందారపు మురళి డిమాండ్‌

కబ్జాకు గురైనప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలిరౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కందారపు మురళి డిమాండ్‌

కబ్జాకు గురైనప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలిరౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కందారపు మురళి డిమాండ్‌ప్రజాశక్తి- తిరుపతి (మంగళం): ఉమ్మడి శెట్టిపల్లె పంచాయతీ పరిధిలో అర్హులైన నిరుపేదలకు జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చి, ఇక్కడున్న ప్రభుత్వ భూములను విడిచిపెట్టి దూరప్రాంతమైన చిందేపల్లిలో ఇళ్ల స్థలాలుచూపడం ఎంత వరకు సమంజసమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక రణధరపురం గ్రామపంచాయతీలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం, టిడిపి, జనసేన పార్టీల రౌండ్‌ టేబుల్‌ సమావేశం సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె. వేణుగోపాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ మంగళం పరిధిలో అనేక ప్రభుత్వ భూములున్నాయని, వాటిని అధికార వైసిపికి చెందినవారు యథేచ్ఛగా కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని, వెంటనే కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి మంగళం పరిధిలో జగనన్న ఇంటి పట్టాలు పొందిన పేదలకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు చూపుతామని పార్టీలకతీతంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా వారి మేనిఫెస్టోలో చేర్చితే వారికి ఓటు వేయడానికి ప్రజలు ఆలోచిస్తారన్నారు. ప్రజాసమస్యల గొంతుక వినిపిస్తున్న వారిపై దాడులకు దిగితే ఎర్రజెండా నాయకత్వం చూస్తూ ఊరుకోదని, తగిన గుణపాఠాన్ని తప్పక నేర్పిస్తామన్నారు. టిడిపి, జనసేన పార్టీల నాయకులు సురేష్‌, చంద్ర, సుబ్బు యాదవ్‌, అల్లాభాష, రత్నం, కిషోర్‌ మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని జగనన్న ఇంటి పట్టాలు పొందిన వారికి స్థలాలు స్థానికంగానే చూపడానికి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏ నిర్ణయం చేసినా ఆ నిర్ణయం మేరకు సంపూర్ణ మద్దతు తెలిపి భాగస్వామ్యం వహిస్తామన్నారు. అలానే 2019 ఎన్నికల ప్రచారభాగంలో భాగంగా బిటిఆర్‌ కాలనీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అధికారంలోకి రాగానే మూడునెలల్లో ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ ప్రజలకు తెలుగు గంగ ఇస్తామని హామీ ఇచ్చారని, నేటి వరకు హామీగానే మిగిలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పి.బుజ్జి, బాదుల్లా, మోదిన్‌, హమీద్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️