చె(చి)త్త శుద్ధి ఏది?

చె(చి)త్త శుద్ధి ఏది?

చె(చి)త్త శుద్ధి ఏది?ప్రజాశక్తి – గూడూరు/ సూళ్లూరుపేట వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నది వాస్తవం.. గత 11 రోజులుగా మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాల్సిన సిఎం జగన్మోహన్‌రెడ్డి రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడం గమనార్హం. మున్సిపల్‌ కమిషనర్‌, ఛైర్మన్‌లు పారిశుధ్య కార్మికుల పొట్టగొట్టేలా పోటీ కార్మికులను రంగంలోకి తెచ్చి సమ్మె విచ్ఛిన్నానికి పూనుకున్నారు. అయితే పారిశుధ్య కార్మికులు తమ పొట్టగొట్టే చర్యలకు పాల్పడవద్దని, సమ్మె డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని ‘పట్టు’ బిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం సూళ్లూరుపేటలో ఐదుగురిపై బైండోవర్‌ కేసులు పెట్టారు. అయినా సమ్మె విరమించేది లేదని, ప్రభుత్వ బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని పారిశుధ్య కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల్లోనూ, తిరుపతి కార్పొరేషన్‌లోనూ చెత్త ఎక్కడబడితే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉంది. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలకు నిలయంగా మారింది. ఓ వైపు జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ‘చెత్త’ దిబ్బల వల్ల ఎక్కడ రోగాలు ఎక్కువవుతాయోనని జనం వాపోతున్నారు. మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది సమస్యలు పరిష్కరించి, వీధుల్లో చెత్త లేకుండా చేయాల్సి ఉంది. తమ డిమాండ్లు పరిష్కరిస్తే వెనువెంటనే చెత్త దిబ్బలన్నీ శుభ్రం చేస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరిస్తేనే సమ్మె విరమణ – బి గోపీనాథ్‌, మున్సిపల్‌ సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి ఈ వీధి, ఆ వీధి అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రైనేజి కాల్వలు శుభ్రం చేయకపోవడంతో పూడిక పేరుకుపోయి దోమల బెడద అధికంగా ఉంది. సమ్మెలో ఉన్న పారిశుధ్య కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్లు. సమ్మె విరమింపజేయాల్సిన ప్రభుత్వం రెగ్యులర్‌ కార్మికులతో చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించే ప్రయత్నం చేయగా సిఐటియు ఆధ్వర్యంలో లారీలను అడ్డుకున్నారు. గూడూరు మున్సిపాలిటీలో మొత్తం 203 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య సిబ్బంది ఉన్నారు. వీరంతా సమ్మె చేస్తున్నారు. 32 మంది రెగ్యులర్‌ కార్మికులు మాత్రమే పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. పట్టణంలో రోజూ సుమారు 70 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ఇంటింట చెత్త సేకరణ నిలిచిపోయింది. వీరంతా వీధుల్లో తీసుకొచ్చి పడుస్తుండడంతో చెత్తదిబ్బలు పేరుకుపోయాయి. అలుపెరుగని పోరాటం : కె.సాంబశివయ్య, బి.పద్మనాభయ్య, సిహెచ్‌ సుధాకర్‌రావు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చమని కోరడమే మేం చేస్తున్నాం. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. కనీస వేతనం రూ.26వేలను మున్సిపల్‌ కార్మికులకు ఇవ్వలేకపోతున్నారు. కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లో 40వేల మంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు మున్సిపల్‌ కార్మికులు 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. శాంతియుతంగా సమ్మెచేస్తుంటే, అధికార పక్షం సమ్మెను నీరుగార్చేలా చేయడం, పోలీసుల సాయంతో పోటీ కార్మికులను పనుల్లోకి పెట్టి వారి మధ్య గొడవలు పెట్టడం చేస్తోంది. బైండోవర్‌ కేసులు పెట్టడం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్టగా ఉంది. కుటుంబ పోషణ కష్టంగా ఉంది : ప్రసాద్‌, కార్మికుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడమే కాకుండా, పోటీ కార్మికులతో మా పొట్ట గొట్టే ప్రయత్నం చేస్తోంది. కొద్దిమంది తాత్కాలిక కూలీలను పెట్టి పనులు చేసేందుకు ప్రయత్నించారు. వాహనాలను అడ్డుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. సమ్మెచేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం మాకేం సంతోషం కాదు. చాలీచాలని జీతాలతో ఎన్నాళ్లని గడిపేది. నెలనెలా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది. జీతం చాలకపోవడంతో వడ్డీలకు అప్పులు తేవడం, సగం జీతం వడ్డీలకే సరిపోవడం వల్ల బతుకు దుర్భరంగా మారుతోంది. న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలి.జగన్‌ను నమ్మితే చెవిలో పువ్వే పుత్తూరు టౌన్‌ : జగన్‌ను నమ్మితే చెవిలోపువ్వుపెడతారని మున్సిపల్‌ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేద్కర్‌ సర్కిల్‌ వరకూ చెవిలో పువ్వుతూ నిరసన తెలిపారు. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు డి.మహేష్‌ మాట్లాడుతూ సమ్మె చేయడానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమన్నారు. జనసేన నాయకులు గోపిరాయల్‌ మద్దతు తెలిపారు.

➡️