జీతమైనా పెంచండి..జైల్లోనైనా పెట్టండి..కార్మికసంఘాల జైల్‌భరో జిల్లాలో 2800 మంది అరెస్

జీతమైనా పెంచండి..జైల్లోనైనా పెట్టండి..కార్మికసంఘాల జైల్‌భరో జిల్లాలో 2800 మంది అరెస్

జీతమైనా పెంచండి..జైల్లోనైనా పెట్టండి..కార్మికసంఘాల జైల్‌భరో జిల్లాలో 2800 మంది అరెస్టుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం ‘చాలీచాలని జీతాలతో ఎన్నాళ్లని అప్పుచేసి, వడ్డీలు కట్టుకుంటూ బతుకు జీవనం సాగించాలి.. మా వల్ల కాదు.. మీరు ఇచ్చిన హామీ మేరకు జీతాలైనా పెంచండి.. లేదంటే జైల్లోనైనా పెట్టండి’ అంటూ కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకొచ్చి ‘జైల్‌భరో’ నిర్వహించాయి. తిరుపతి జిల్లావ్యాప్తంగా భారీ ప్రదర్శనలు, మానవహారాలు,రాస్తారోకోలు నిర్వహించారు. మొత్తం 2,800 మందిని అరెస్టు చేసి, అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అంగన్‌వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి భవిష్యత్‌లో ఏడుపే మిగులుతుందని నేతలు ఉద్ఘాటించారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నేతలు కందారపు మురళి, కె.రాధాక్రిష్ణ, ఆర్‌.హరిక్రిష్ణ ఆధ్వర్యంలో తిరుపతిలో జైల్‌భరో నిర్వహించారు. పాత మున్సిపల్‌ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకూ సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ప్రదర్శన నిలిపేయాలని, ముందుకు వెళ్లడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. దీంతో కార్మిక సంఘాల నేతలు అక్కడే బైఠాయించారు. అంగన్‌వాడీ మహిళలు పెద్ద సంఖ్యలో ఉండడంతో బందోబస్తుకు వచ్చిన మగ పోలీసులు అరెస్టులకు వెనకడుగు వేశారు. దీంతో కార్మిక సంఘాల నేతలు ప్రదర్శనను కొనసాగించే ప్రయత్నం చేయగాఈస్టు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. తక్షణం సిఎం అంగన్‌వాడీల, మున్సిపల్‌ కార్మికుల, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని పక్షంలో సిఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈస్టు పోలీసు స్టేషన్‌ అంతా అంగన్‌వాడీ మహిళలతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో నేతలు వేణుగోపాల్‌, టి.సుబ్రమణ్యం, చిన్నా, బుజ్జి, బాలాజీ, ఎన్‌డి శ్రీనివాసులు, నాగరాజమ్మ, జయప్రభ, ఎల్లమ్మ, గీత, గోమతి, రాధాక్రిష్ణ, సుబ్రమణ్యం, భారతి, గంగ తదితరులు పాల్గొన్నారు. – శ్రీకాళహస్తిలో ‘జీతాలైనా పెంచండి.. జైల్లోనైనా పెట్టండి’ అంటూ అంగన్‌వాడీలో రోడ్డెక్కారు. ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. టుటౌన్‌ పోలీసులు అంగన్‌వాడీలను అరెస్టు చేసి, సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. నాయకులు అంగేరి పుల్లయ్య, పెనగడం గురవయ్య, గంధం మణి, పుష్ప, సౌజన్యం, స్వర్ణ, సక్కుభాయమ్మ, మురళి పాల్గొన్నారు. – నాయుడుపేటలో హోటల్‌ అమరావతి సెంటర్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్‌, అంగన్‌వాడీ కార్మికులు మానవహారం నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని నినదించారు. సమ్మె విరమించాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నాయకులు వినకపోవడంతో అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చాపల వెంకటేశ్వర్లు, శివకవి ముకుంద, శ్యామలమ్మ, గోపాలయ్య పాల్గొన్నారు. – సత్యవేడులో సమ్మె ఉధృతంగా సాగింది. సిఐటియు డివిజన్‌ నాయకులు రమేష్‌ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వేతనాలు పెంచకపోతే, ఎన్నికల్లో మహిళా శక్తి చూపిస్తారని హెచ్చరించారు. పోలీసులకు, నాయకులకు మధ్య పెనుగులాట జరిగింది. అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి, సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. మునిరాజు, మురళి, బాష, నిర్మల, భువన, సరళ పాల్గొన్నారు. – గూడూరు టౌన్‌లో టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎస్‌.సురేష్‌, బివి రమణయ్య, జోగిశివకుమార్‌, ఇంద్రావతి, బిఎస్‌ ప్రభావతి, పెంచలమ్మ, లక్ష్మీ మణికుమారి పాల్గొన్నారు. – పుత్తూరు అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద జైల్‌భరో కార్యక్రమంలో నేతలను అరెస్టు చేశారు. సిఐటియు, ఎఐటియుసి నాయకులు వెంకటేష్‌, నందయ్య, డి.మహేష్‌, అంగన్‌వాడీలను అరెస్టు చేశారు. – రేణిగుంట పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద రోడ్డును అర్ధగంటసేపు దిగ్బంధం చేశారు. దీంతో పోలీసులు నాయకత్వాన్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన అంగన్‌వాడీలో మధ్యాహ్నం వరకూ నిరసన తెలపడంతో అరెస్టు చేసిన నాయకులను వదిలేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రమణ్యం, ఎంపిటిసి రాజేశ్వరి, నాయకులు కరీముల్లా, రంగయ్య, నరసింహారెడ్డి, హరినాథ్‌, ఒ.వెంకటరమణ, శివానందం, ధనమ్మ, భాగ్యలక్ష్మి, రాధమ్మ, భారతి పాల్గొన్నారు. – వెంకటగిరిలో అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో జైల్‌భరో నిర్వహించారు. బంగారుపేట నుంచి రాపూర్‌ క్రాస్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. వడ్డిపల్లిచెంగయ్య, ఎ.భాస్కర్‌, ఎ.మంజుల, సుభాషిణి, జయంపు, ఎస్‌.ప్రసాద్‌, టి.సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. – చంద్రగిరి టవర్‌క్లాక్‌ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణీశ్రీ మాట్లాడుతూ ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లుగా, అంగన్‌వాడీల నుంచి ఓట్లు వేయించుకుని అధికారానికి వచ్చిన అనంతరం పట్టించుకోకపోవడం తీరని ద్రోహమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రియదర్శిని, నాగరాజమ్మ పాల్గొన్నారు.

➡️