తిరుపతిలో ‘ఆరణి’ ప్రచారం

Mar 27,2024 21:55
తిరుపతిలో 'ఆరణి' ప్రచారం

ప్రజాశక్తి – తిరుపతి సిటి జనసేన – టిడిపి – బిజెపి కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బుధవారం తిరుపతిలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. కపిలతీర్థం సర్కిల్‌ నుంచి జీవకోన వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నవజీవన్‌ కాలనీలో గంగమ్మ గుడిలో, జీవకోన జీవలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటింట ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ చిరంజీవి 2009లో జీవలింగేశ్వర స్వామి ఆశిస్సులు పొంది ప్రచారం ప్రారంభించారని, అదే బాటలో తాను ఇంటింటి ప్రచారం ప్రారంభించానన్నారు. జీవకోనలో ఆయన మాట్లాడుతూ ఎంఎల్‌ఎ కరుణాకర్‌రెడ్డి అభివృద్ధి పేరుతో అబద్దాల ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత స్కీం నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి డివిజన్‌లో ఖర్చుచేయలేదన్నారు. జీవకోనలో ఇళ్ల క్రమబద్దీకరణ సమస్యను పరిష్కరించడంలో ఎంఎల్‌ఎ విఫలమయ్యారన్నారు. రానున్న ప్రభుత్వంలో డివిజన్‌లోని ఇళ్లపట్టాల క్రమబద్దీకరణ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొందరి వల్ల జీవకోనకు చెడ్డపేరు వస్తోందని, తిరుపతి నగరంలో ఏ మూల నేరాలు జరిగినా జీవకోనలో పోలీసులు సోదాలు చేస్తున్నారన్నారు. గంజాయి అమ్మకాలను ఎంఎల్‌ఎ, ఆయన కుమారుడు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి అమ్మకందారులను శిక్షించి జీవకోనలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతానన్నారు. నగర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ను డిప్యూటీ మేయర్‌ అభినరురెడ్డి డమ్మీగా మార్చారన్నారు. జీవకోనలో నిర్మించిన రెండు మాస్టర్‌ప్లాన్‌రోడ్లకు ప్రభుత్వ అనుమతులు లేవని, ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. టిడిఆర్‌ బాండ్ల పేరుతో ఎంఎల్‌ఎ కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినరురెడ్డిలు దోచుకున్న డబ్బును కక్కిస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు గాజు గ్లాసుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే మోహన్‌, సూరా సుధాకర్‌ రెడ్డి, ఎల్బీ సుధాకర్‌ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. అయితే టిడిపి ప్రధాన నాయకత్వం, జనసేనలో కొంతమంది కూటమి అభ్యర్థి ప్రచారంలో ఎక్కడా కానరాలేదు.

➡️