పొలాలకు పవర్‌ కట్‌

Apr 1,2024 21:13

మాది రైతు ప్రభుత్వం..వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందిస్తాం..ప్రతి ఎకరా తడిసేలా చేస్తామన్న సర్కారు మాటలు వట్టి నీటిమూటలే అయ్యాయి. తిరుపతి జిల్లాలో ఎక్కడా తొమ్మిది గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరగడం లేదు. దీంతో చేతికందొచ్చిన పంటలు నిలువునా ఎండుతున్నాయి. ఓ వైపు చెరువుల్లో నీరు నిండుకుంది. తెలుగుగంగ కాలువలోనూ నీటి ప్రవాహం లేదు. కనీసం బోర్లు, బావుల ద్వారానైనా కళ్లముందే ఎండిపోతున్న పంటలను తడుపుకుని కాపాడుకుందామంటే అనధికార కరెంట్‌ కోతలు రైతుల ఆశకు కళ్లెం వేస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు మండలాల్లో ఈ ఏడాది రబీలో అధిక మొత్తంలో వరి, వేరుశెనగ, పుచ్చ, దోస, చెరుకు, మినుము పంటలు వేశారు. పేరుకేమో 9 గంటల విద్యుత్‌ సరఫరా .. నిజానికి 7 గంటలే ఇస్తుండటంతో చేతికందే పంటలు నిలువునా ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. 9 గంటలు సరఫరా చేస్తున్నాం: వాసు రెడ్డి, ఈఈ, తిరుపతివ్యవసాయానికి 7 గంటలే సరఫరా అందుతోందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి 9 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. సాంకేతిక సమస్యలు ఉన్న రోజు మాత్రమే గంటల్లో కోత పడుతోంది. వ్యవసాయానికి 7 గంటలే సరఫరా అందించాలన్న నిబంధన ఏమీ లేదు. అలా ఎక్కడైనా జరిగితే, రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. కంటి ముందే పంట ఎండుతోంది: రవి, రైతువ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉండేది. అయితే రెండు నెలలుగా ఏడు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో పుచ్చ, వేరుశెనగ పంటలకు సాగునీటిని అందించడం కష్టతరమవుతోంది. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్నాం. వాటికి సాగునీరిందించలేకపోతే ఎలా. అధికారులు పునరాలోచించాలి. ప్రజాశక్తి-శ్రీకాళహస్తిగతంలో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తుండేవారు. అది కూడా పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా ఉండేది. దీంతో రాత్రిళ్లు మోటార్లు వేసేందుకు వెళ్లి రైతులు విద్యుత్‌ షాక్‌కు, పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. అంతేకాకుండా వ్యవసాయానికి 6 నుంచి 7 గంటల సరఫరా సరిపోకపోవడంతో దాన్ని 9 గంటలకు పెంచారు. అది కూడా రైతులు ప్రమాదాల బారినపడకుండా పగటి పూట మాత్రమే సరఫరా అందేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ నుంచి తిరుపతి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి కేవలం 7 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఫిబ్రవరి 8వ తేదీకి ముందు వారానికో షిప్టు చొప్పున ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఇంకో వారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటలకు వరకు నిరంతరం 9 గంటల విద్యుత్‌ సరఫరా వ్యసాయానికి అందేది. దీంతో ఎంతోకొంత పంటలను తడుపుకునేందుకు వీలు చిక్కేది. అయితే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి వ్యవసాయానికి 7 గంటలే విద్యుత్‌ సరఫరా చేస్తుండటంతో చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే ఈ కోతలన్నీ అనధికారిక కోతలేనని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం 9 గంటలు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నా వాస్తవానికి ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఆ విధంగా సరఫరా చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వేసవి దృష్ట్యా విద్యుత్‌ ఉత్పత్తి తగ్గి వ్యవసాయానికిచ్చే సరఫరాలో కొర్రీ పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా అందని కారణంగా తొట్టంబేడు, కేవీబీపురం, బుచ్చినాయుడకండ్రిగ, శ్రీకాళహస్తి రూరల్‌, ఏర్పేడు మండలాల్లో వందలాది ఎకరాల వేరుశెనగ పంటలు ఎండుతున్నట్లు రైతులు వాపోతున్నారు.సాగునీటి ప్రాజెక్టుల సాగదీతా ఓ కారణమే!నియోజకవర్గంలో సాగు, తాగునీటి కొరత తీర్చేందుకు చేపట్టిన బృహత్తర ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడం కూడా ఒకరకంగా కరువుకు ఆజ్యం పోస్తున్నాయి. సోమశిల-స్వర్ణముఖి, మల్లిమడుగు, బాలాజీ రిజర్వాయర్‌ పనులు పూర్తయితే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరంది ఉండేది. రైెతులు కరెంట్‌పై ఆధారపడి ఉండే వారు కాదు. చేతికొచ్చిన పంటలు ఎండేవి కావు. ఇప్పటికి సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టు పనులు 80 శాతం పనులు పూర్తి చేసుకోగా, తక్కిన ప్రాజెక్టుల పనులు 25 శాతానికే పరిమితమయ్యాయి. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు రేణిగుంట, తిరుపతి ప్రాంతాలకు సాగు, తాగునీరందించాలన్న లక్ష్యంతో పొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలోని రాపూరు వద్ద ఉన్న సోమశిల-కండలేరు ప్రాజెక్టు నుంచి శ్రీకాళహస్తి మండలంలోని తొండమనాడు వద్ద ఉన్న స్వర్ణముఖి బేసిన్‌లోకి నీటిని తరలించడంలో భాగంగా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఎస్‌ఎస్‌కెనాల్‌ను ప్రారంభించారు. సుమారు రూ.369 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లాలోని రాపూరు, ఢక్కిలి, వెంకటగిరి, బాలయపల్లితో పాటు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో ప్రత్యక్షంగా 12 వేల ఎకరాలకు, పరోక్షంగా 90 వేల ఎకరాలకు సాగునీరందించడం లక్ష్యం. అదేవిధంగా పైన పేర్కొన్న మండలాలతో పాటు రేణిగుంట, తిరుపతిని కలుపుకుని 0.21 టీఎంసీల తాగునీటిని సరఫరా చేయడం కూడా మరో లక్ష్యం. సరిగ్గా 100 కిలీమీటర్ల మేర కాలువను తవ్వాల్సి ఉంది. ప్రారంభంలో పనులు బాగానే జరిగినా రాను రాను పనులు నత్తను తలపిస్తున్నాయి. ఢక్కిలి మండలంలో రిజర్వ్‌ ఫారెస్టు, వైల్డ్‌లైఫ్‌ వివాదాలు, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో భూ వివాదాలతో పాటు నష్టపరిహార వివాదాలు ఎస్‌ఎస్‌కెనాల్‌ పనులకు మోకాలడ్డుతున్నాయి. ఏదో విధంగా సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకులు తలెత్తుతుండటంతో రైతుల ఆశలకు బ్రేకులు పడుతున్నాయి. తమ కన్నీటిని తుడిచే వారే లేరా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సరిగా కరెంట్‌ ఇవ్వరు..కనీసం ప్రాజెక్టులనైనా పూర్తి చేయరంటూ మండిపడుతున్నారు.

➡️