‘ప్రతిభ’కు ప్రోత్సాహం… ‘బాలోత్సవం’

Dec 23,2023 22:14
'ప్రతిభ'కు ప్రోత్సాహం... 'బాలోత్సవం'

ప్రజాశక్తి -తిరుపతి సిటీ చదువుతో పాటు క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు, సంగీతం తదితరాల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతూ తమ ప్రతిభను చూపేందుకు ఎదురు చూస్తున్న పిల్లలకు బాలోత్సవం వేదికయ్యింది. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి హై స్కూల్‌ విద్యార్థుల వరకూ వివిధ రంగాలలో పోటీలు నిర్వహించి, వారిలోని సజనాత్మకతను వెలికి తీసేందుకు తిరుపతి బాలోత్సవం నడుము కట్టింది. తిరుపతి యశోదనగర్‌ కేంద్రంగా బాలోత్సవం అందుకు శ్రీకారం చుట్టింది. 2022, డిసెంబర్‌లో తిరుపతిలో మొట్టమొదటిసారిగా బాలోత్సవం ద్వారా పిల్లల పండగ నిర్వహించింది. వేలాది మంది విద్యార్థులు ఇందులో పాల్గొని, తమలోని నైపుణ్యాన్ని బహిర్గత పరిచారు. దీంతో విద్యార్థుల్లో చదువుతో పాటు మరో కోణం వెలికి తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. మొదట ఏడాది కలిగిన ఆదరణ, ఉత్సాహంతో రెండో ఏడాది మరింత ఎక్కువ స్థాయిలో పిల్లల పండుగ నిర్వహించాలని బాలోత్సవ కమిటీ నిర్ణయించింది. అనుకున్నది తడువుగా కొన్ని నెలల పాటు తాము అనుకున్న ప్రణాళికను అమలు చేస్తూ ప్రతి పాఠశాల తిరిగి, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఈ పోటీల గురించి వివరించారు. అందుకు వారు మరింత ఉత్సాహం చూపి పాల్గొనేందుకు సిద్ధం కావడంతో కొంతమంది దాతల సహకారంతో పిల్లల పండగకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 16, 17 తేదీల్లో శ్రీ పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హై స్కూల్‌ ప్రాంగణంలో పోటీలు చేపట్టారు. సుమారు 5 విభాగాల్లో 29 అంశాలలో పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం, వ్యాసరచన (తెలుగు),(ఇంగ్లీష్‌), కథ రచన (తెలుగు), స్పెల్‌ బి ఇంగ్లీష్‌, తెలుగు డిక్టేషన్‌, మ్యాప్‌, మెమొరీ టెస్ట్‌, సైన్స్‌ ఎగ్జిబిషన్‌, తెలుగులో మాట్లాడడం, వక్తృత్వం (తెలుగు), (ఇంగ్లీష్‌) పద్య భావం, కథ చెబుతాను కొడతారా, కవితా రచన, మట్టితో బొమ్మలు, బెస్ట్‌ ఫ్రం వేస్ట్‌, ఏకపాత్రాభినయం, క్లాసికల్‌ డాన్స్‌ సోలో, దేశభక్తి గీతాలాపన, జానపద నత్యం, ఇన్రూట్స్‌ మెంటల్‌, యోగ, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు, చెస్‌, తైక్వాండ్‌ అంశాలలో పోటీలు నిర్వహించారు. విద్యార్థులను నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ పోటీలకు వందకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 5వేల మందికి పైగా విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటారు. తిరుపతి కేంద్రంగా రెండు రోజులపాటు పిల్లల పండగ అత్యంత వేడుకగా ఉత్సాహవంతమైన వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోటాపోటీగా ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభకు పదును పెట్టారు. న్యాయ నిర్ణీతలను సైతం అవాక్కుపరిచేలా విద్యార్థులు పోటీ పడడం గమనార్హం. తిరపతి బాలోత్సవం గౌరవ అధ్యక్షులు టెంకాయల దామోదరం, అధ్యక్షులు నడ్డా నారాయణ, కార్యదర్శి మల్లారపు నాగర్జున,కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పిల్లలకు వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రాంగణం మొత్తం తిరునాళ్లను తరిపించింది. జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. పౌరాణిక రాజుల వస్త్రధారులతోపాటు, సరికొత్త డిజైనర్లతో కూడిన వస్త్రాలతో ఫాన్సీ డ్రెస్‌ పోటీలను వేడెక్కించారు. ఇది కదా నిజమైన పిల్లల పండుగ అంటూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ బహిరంగంగానే పొగడ్తలతో ముంచెత్తారు.

➡️