భావితరాల భవిష్యత్తు కోసమే ఉద్యమం: చలసాని

భావితరాల భవిష్యత్తు కోసమే ఉద్యమం: చలసాని

భావితరాల భవిష్యత్తు కోసమే ఉద్యమం: చలసానిప్రజాశక్తి-తిరుపతి(మంగళం): విభజించిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని బిజెపి ప్రభుత్వం విస్మరించిందని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌ పై పెడతారని కాంగ్రెస్‌ తీర్మానం చేసిందని తాము భావి తరాల భవిష్యత్తు కోసమే ఉద్యమిస్తున్నామని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులతో కలిసి చలసాని మాట్లాడారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఆంధ్రప్రదేశ్‌ కి రావలసిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష యాభై వేల కోట్ల ఖర్చుతో ముంబై నుండి గుజరాత్‌ కు మోడీ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు తీసుకుపోలేదా ? అని ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను ఇస్తే వైసిపి కేంద్రంలోని పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రకటించి, నేడు అధికారం చేపట్టాక ఆ విషయం గాలికొదిలేశారన్నారు. వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివద్ధిని, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టవద్దన్నారు. కులం మతం పేరుతో విభజించి పాలించే బిజెపి సంస్కతి నుండి ప్రజలు చైతన్యవంతులుగా ఆలోచించి ప్రత్యేక హోదా ఇచ్చే వారికి పట్టం కట్టాలని సూచించారు. ప్రత్యేక హోదా ప్రస్తావించిన వారిని, పోరాడే వారిపై కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. చరిత్ర కలిగిన తెలుగువారిని చిన్న చూపు చూస్తూ తెలుగు నేల అభివద్ధి చెందకుండా నిరోధకులుగా బిజెపి నాయకుల వ్యవహార శైలి ఉందన్నారు. వైసిపి, టిడిపి, జనసేన కేవలం రాజకీయం కోసం పాకులాడుతున్నారే తప్ప, రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించడం లేదని, పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హోదా పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం ప్రత్యేక హోదా కోసం కలిసి వస్తానని ప్రకటించారన్నారు. ఇందుకు రేవంత్‌ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ఎందరో బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వలేదన్నారు. చివరికి తిరుమల శ్రీవారి ఖజానాకు ఎసురు పెట్టడానికి శ్రీవాణి ట్రస్టు పేరుతో నగదు బదలాయింపు కుయుక్తి పనులు చేస్తున్నారన్నారు. తెలుగు ప్రజలకు బిజెపి తీరని ద్రోహం చేసిందని, హోదా కోసం హోదా సాధన సమితి పోరాటానికి సిపిఎం మద్దతు ఇస్తోందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు నవీన్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ కి ఒక సంజీవని అన్నారు. గడిచిన సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివద్ధి ఏమీ లేదని, ప్రశ్నించే గొంతుకులను పోలీసు కేసులతో భయపెట్టడం సరికాదన్నారు. ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన సమితి పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులు, మేధావులు, మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ బీజేపీ హామీకి తొమ్మిది ఏళ్లు గడిచాయని, ప్రజలు ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం కలసికట్టుగా కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు.

➡️