రాపిడో..నిరుద్యోగ యువతకు ఉపాధిగా…రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణఅందుబాటులో కార్లు, ఆటోలు, బైక్‌లు

రాపిడో..నిరుద్యోగ యువతకు ఉపాధిగా...రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణఅందుబాటులో కార్లు, ఆటోలు, బైక్‌లు

రాపిడో..నిరుద్యోగ యువతకు ఉపాధిగా…రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణఅందుబాటులో కార్లు, ఆటోలు, బైక్‌లు తిరుపతి జీవకోన స్లమ్‌ ఏరియా.. చిన్న సందులో ఉండే మునెమ్మకు ఇటీవల ఆరోగ్యం బాగోలేదు. ఆటోలో రుయాకు వెళ్లేందుకు ఆటో అడగ్గా రూ.200 అడిగారు. రానుపోను 500 అవుతుంది. ఇంతలో పక్కింట్లో యువకుడు రాపిడో బుక్‌చేశాడు. నిమిషాల్లో వారి ఇంటి వద్దకే ఆటో వచ్చి ఆగింది. అది కూడా కేవలం 60 రూపాయలకే. తిరుపతి రూరల్‌ మల్లగుంట పంచాయతీలోని రామానుజం చెక్‌పోస్టుకు చేరువలో ఉన్న అంబేద్కర్‌ కాలనీ నుంచి ఓ యువతి ఇటీవల జేఇఇ మెయిన్స్‌కు కరకంబాడి రోడ్డులోని కళాశాలకు వెళ్లాలి. పేద కుటుంబం. ఇంట్లో ద్విచక్రవాహనం లేదు. వెంటనే స్నేహితుల సాయంతో రాపిడో బుక్‌ చేసింది. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళాశాలకు కేవలం రూ.80కే, 20 నిమిషాల వ్యవధిలో చేరవేశాడు. సరైన సమయానికి ఆ యువతి పరీక్షకు భద్రంగా హాజరయ్యింది. అలిపిరి – చెర్లోపల్లి రోడ్డులోని అరవింద ఐ ఆస్పత్రికి రెండు రోజుల క్రితం కంటి వైద్యం కోసం వచ్చిన ఓ వృద్ధ దంపతులు తిరుగు ప్రయాణం కోసం అక్కడ సిబ్బంది సూచనతో రాపిడోలో ట్యాక్సీ బుక్‌ చేసుకున్నారు. అరవింద ఆస్పత్రి నుంచి రేణిగుంట రోడ్డులోని కొరమేనుగుంట వరకూ. ఇంటికి కేవలం 30 నిమిషాల్లో రూ.150కే భద్రంగా చేరారు. ప్రజాశక్తి-తిరుపతి సిటి రాపిడో..మన పక్కనే ఉన్నట్లుంటారు.. క్షణాల్లో మనవద్దకు వాలిపోతారు.. ఓ ‘బ్రదర్‌’లా వీరు అందిస్తున్న సేవలతో రోజురోజుకూ వీరిపట్ల ఆదరణ పెరుగుతోంది. నిరుద్యోగ యువత ‘రాపిడో’ను ఉపాధిగా మరల్చుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ వీరు సుపరిచితమే. అతి తక్కువ ధరకు, ఇంటి వద్దకే వచ్చి, గమ్యస్థానానికి తక్కువ సమయంలో క్షేమంగా చేర్చడంలో రాపిడో అద్దె వాహనాలదే హవా. ట్యాక్సీ, కారు, ఆటోల నుంచి ఇప్పడు ద్విచక్రవాహనాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా తిరుపతి కేంద్రంలో రాపిడో కెప్టెన్లను సైతం సత్కరించి, ప్రయాణికులకు మరింత అవగాహన కల్పించారు. రాపిడో యాప్‌ అందరికీ అందుబాటులోకి రావడంతో వ్యక్తిగత బడ్జెట్‌లో కొంత మిగులుతుందనేది అక్షర సత్యం. చదువుకుంటున్న విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ‘పాకెట్‌ మనీ’లా రాపిడో సేవల ద్వారా అందుతుండటం వల్లనే రోజురోజుకూ ఆదరణ పెరుగుతుంది. ‘రక్షణ’లో భాగంగా వీరు హెల్మెట్‌ ధరిస్తున్నా, తాము ఎవరో తెలియకుండా ఉండేందుకూ వీరి హెల్మెట్‌ ఉపయోగపడుతుండటం గమనార్హం. రాపిడో సేవలందించిన తరువాత ప్రయాణికునికి ఫోన్‌ చేసి ‘క్షేమంగా ఇంటికి చేరారా’ అని అడగటం హైలెట్‌. రాపిడో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. యువత వాట్సాప్‌కు ఎలా కనెక్టు అయ్యారు. రాపిడోకి అంతే కనెక్టు అయ్యారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణికులు కోరిన విధంగా ట్యాక్సీ, కారు, ఆటో, ద్విచక్రవాహనాలను అద్దెకు పంపడం ఆ సంస్థ విధి. మెట్రోనగరాల్లోనే ఉండే ఈ సౌలభ్యం తిరుపతి నగరానికీ వ్యాపించింది. మొదట్లో కేవలం 10 మంది కెప్టన్లుతో (డ్రైవర్లతో) నడిచిన ఈ సంస్థ ఇప్పడు తిరుపతి నగరంలోనే సుమారు 285 మంది కెప్టన్లు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. సొంత ద్విచక్రవాహనం ఉన్న యువత ఇటీవల కాలంలో ఎక్కువగా రాపిడోలో తమ పేర్లు నమోదు చేసుకుని ఉపాధి రంగంగా మలుచుకుంటున్నారు. చదువుకునే విద్యార్థులు సైతం పార్ట్‌టైమ్‌గా ఈ ఉపాధి రంగాన్ని ఆశ్రయిస్తుండడం గమనార్హం. తక్కువ ధరకే, సుదూర ప్రాంతాలను సైతం క్షేమంగా, భద్రంగా చేర్చడం వల్ల, అందులోనూ డ్రైవరు పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో ఉండడం వల్ల అటు ప్రయాణీకులకు, ఇటు డ్రైవర్లకు ఇది చాలా భద్రత కల్పించేదిగా మారింది. దీంతో అనతికాలంలోనే రాపిడోకి ఆదరణ మరింత పెరిగింది. రాపిడో కాస్త సాయంగా ఉంటోంది : ఎస్‌.సురేష్‌, పీజీ స్టూడెంట్‌ నేను తిరుపతిలో పీజీ చదువుతున్నా.. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నా. అమ్మానాన్నలు చదువుకు అయ్యే ఖర్చు అంతా పంపిస్తారు. ఇటీవల రాపిడోలో నా సొంత బైక్‌ను రిజిస్టర్‌ చేసుకున్నాను. పార్టు టైమ్‌గా ప్రయాణీకులను చేరవేస్తున్నాను. దీని వల్ల కుటుంబంపై ఆధారపడకుండా నా చదువుకు నేనే సంపాదిస్తున్నాను. ఇది నాకు చాలా సహాయకారిగా ఉంది.కుటుంబానికి అండగా ఉంటున్నాను : జి.ఎల్లయ్య, ఆటో డ్రైవర్‌, చెన్నారెడ్డి కాలనీ నేను రెండేళ్ల క్రితం ఆటోను ఈఎంఐలో కొన్నాను. ఆటోకు గిరాకీలు సరిగా రాలేదు. మరోపక్క పెట్రోల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. ఆరు నెలల క్రితం రాపిడోలో రిజిష్టర్‌చేసుకున్నాను. రోజూ క్రమం తప్పకుండా గిరాకీలు వస్తున్నాయి. సాయంత్రానికి ఇఎంఐ పోను కుటుంబానికి ఆదాయం మిగులుతోంది.

➡️