రుయాలో భద్రత డొల్ల..!సిసి కెమెరాల ఊసే లేదు

రుయాలో భద్రత డొల్ల..!సిసి కెమెరాల ఊసే లేదు

రుయాలో భద్రత డొల్ల..!సిసి కెమెరాల ఊసే లేదుప్రజాశక్తి-తిరుపతి సిటి రాయలసీమకు తలమానికం రుయా ఆస్పత్రి.. అయితే భద్రత డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేదల పెద్దాసుపత్రిలో సిసి కెమెరాల ఊసే లేదు. నిత్యం ఏదో ఓ చోట చోరీలు జరుగుతూనే ఉన్నా పట్టించుకునే నాధుడే లేడు. రోగులు నిలదీస్తే సెక్యూరిటీ సిబ్బందిపైకి నెట్టేయడం షరా మామూలయ్యింది. సుమారు 20 వేల మంది నిత్యం ఇక్కడ వైద్యసేవలు పొందడం, విధులు నిర్వహించడం, శిక్షణ పొందడం చేస్తుంటారు.అయితే పరిపాలనా, పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. శ్రీవేంకటేశ్వర రామ నారాయణ రుయా గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (ఎస్‌విఆర్‌ఆర్‌జిజిహెచ్‌). రుయా ఆసుపత్రిగా అందరికి సుపరిచితమే. రాయలసీమ ప్రాంతంలోనే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అతిపెద్ద పేదల పెద్దాసుపత్రి ఇది. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కోస్తాంద్రకు చెందిన ఉమ్మడి నెల్లూరు జిల్లా, తమిళనాడు, కర్ణాకట రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలకు ఇదే ప్రదాన ఆసుపత్రి. ఇక్కడ నిత్యం ఓపి సేవల నిమిత్తం 1200 నుంచి 1500 మంది వరకు వస్తుంటారు. సోమ, మంగళవారాల్లో ఓపి సంఖ్య 2000కు పైగా ఉంటుంది. 1000 పడకల సామర్ధ్యం గల ఈ ఆసుపత్రిలో నిత్యం 1500కు పైగా రోగులు చికిత్స పొందుతుంటారు. పడకలు చాలక స్ట్రెచ్చర్లపై, వీలు చైర్లపై రోగులు చికిత్స పొందడం ఇక్కడ నిత్యకృత్యం. అత్యంత ప్రాచీనమైన ఎస్‌వి మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఈ ఆసుపత్రి సేవలందిస్తుంది. ఎస్‌విఎంసి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, దేశ విదేశాల్లో స్థిరపడిన అనేక మంది ప్రముఖ వైద్యులు ఈ కళాశాల నుంచి వైద్య పట్టా పొందిన ఘన చరిత్ర కలది. రుయా ఆసుపత్రికి అదనంగా ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల (గవర్నమెంట్‌ మెటర్నటీ హాస్పిటల్‌), చిన్నపిల్లల ఆసుపత్రి (చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌) వైద్యసేవలు అందిస్తున్నాయి. రుయా అత్యవసర విబాగానికి రోజుకు 500మందికి పైగా రోగులు అత్యవసర చికిత్స నిమిత్తం వస్తుంటారు. వందలాది మంది ఎంబిబిఎస్‌, పిజి విద్యార్థులు, శ్రీపద్మావతి ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలకు చెందిన నర్సింగ్‌ విద్యార్థులు, పారామెడికల్‌ విద్యార్థులు, పలు విభాగాలకు చెందిన వైద్య అధ్యాపకులు, వైద్యనిపుణులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది, సెక్యూరిటీ, పారిశుద్ద కార్మికులు, వీరికి తోడు వివిధ ప్రయివేట్‌ నర్సింగ్‌ కళాశాల నుంచి సుమారు వెయ్యికి పైగా నర్సింగ్‌ విద్యార్ధులు ఇక్కడ సేవలందిస్తుంటారు. జిగ్‌జాగ్‌గా ఉండే రుయాలో ఎప్పడు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన ఈ ఆసుపత్రిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. నిత్యం ఏదో ఓ చోట చోరీలు జరుగుతూనే ఉంటాయి. రోగులు, రోగుల సహాయకులు నిత్యం బాధితులే. కొన్ని బయటకొస్తాయి. అనేకం బయటకు పొక్కక పోవడం గమనార్హం. పైగా బయటకు వచ్చిన వాటిలో కూడా పోలీసుల దృష్టికి వెళ్లేవి వేళ్లపై లెక్కపెట్ట వచ్చు. పలు చోరీలకు పాల్పడే పాతనేరస్తులు సైతం రుయా ప్రాంగాణాన్ని తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. కోట్లాది రూపాయాలు అభివృద్ది పేరుతో వెచ్చిస్తున్న జిల్లా అధికారులు కనీసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం కొస మెరుపు. ఇటీవల పోలీసులు వెంటపడి వేడుకుంటే అరాకొరాగా సిసికెమెరాలు ఏర్పాటు చేశారు. అవి కూడా సక్రమంగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ‘భద్రత’ను పటిష్టం చేయాల్సి ఉంది.

➡️