శిబిరాల్లో అంగన్‌వా(వే)డి

Dec 23,2023 22:08
శిబిరాల్లో అంగన్‌వా(వే)డి

ప్రజాశక్తి – యంత్రాంగం అసలే శీతాకాలమ్‌.. చలి గజగజ వణికిస్తోంది.. అయినా అంగన్‌వాడీల సమ్మె శిబిరాల్లో మాత్రం వేడి సెగలు రగులుతున్నాయి.. రోజురోజుకూ శిబిరాల్లో అంగన్‌వాడీల నినాదాలు హోరెత్తుతున్నాయి.. వేతనం పెంచేంత వరకూ వెనకడుగు వేసేది లేదని ఉద్ఘాటిస్తున్నారు. గత 12 రోజులుగా ప్రతిరోజూ శిబిరం వద్దకు ఉదయం 9 గంటలకల్లా చేరుకోవడం, సాయంత్రం 4 గంటల వరకూ శిబిరాల్లోనే ఉంటూ సమ్మెను విజయవంతంగా అంగన్‌వాడీలు కొనసాగిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు రేణిగుంటలో గుడి ముందు అంగన్‌వాడీలో ‘జగనన్న భిక్షాటన’ చేశారు. ప్రతి శిబిరంలోనూ ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన నేతలు శనివారం నిరాహారదీక్ష నిర్వహించారు. – పుత్తూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మద్దతు పలికారు. ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యిందన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకూ సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. మంత్రి ఆర్‌కె రోజా స్పందించి సిఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడి అంగన్‌వాడీలకు న్యాయం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ 26వ తేదీ లోపు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి అంగన్‌వాడీల సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. జగన్మోహన్‌రెడ్డి రూ.500 కోట్లతో పెద్ద భవనం కట్టుకున్నారని, అంగన్‌వాడీలకు వేతనం పెంచడానికి తర్జన భర్జన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌, ఎ.విజరు, డి.మహేష్‌, కెఆర్‌ సుబ్రమణ్యం, యాసిన్‌బాష, అంగన్‌వాడీలు మునికుమారి, విజయకుమారి, ధనమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. – రేణిగుంట గుడి వద్ద వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని అంగన్‌వాడీ అక్కచెల్లెళ్లు కొంగుపట్టి ‘జగనన్న భిక్షాటన’ చేపట్టారు. ‘ఏడు కొండలవాడా గోవింద.. జగనన్న మనస్సు మార్చవయ్యా..’ అంటూ నినాదాలు చేశారు. సిఐటియు మండల కార్యదర్శి కె.హరినాథ్‌, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రేణిగుంట ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ నాయకత్వం వహించారు. – చంద్రగిరిలో ‘మా ఉసురు ఊరికే పోదు’ అంటూ నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌.జయచంద్ర, ఆర్‌.లక్ష్మి, యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ పాల్గొన్నారు. – సత్యవేడులో ఎఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి చంద్రవాబు మద్దతు తెలిపారని సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రమేష్‌ తెలిపారు. అంగన్‌వాడీలు నిర్మల, శాంతి, ఇందిర, సుభాషిణి, భువన తదితరులు పాల్గొన్నారు. – బిఎన్‌ కండ్రిగలో కళ్లకు గంతలు కట్టుకుని సమ్మె కొనసాగించారు. శోభ, సుదర్శన తదితరులు పాల్గొన్నారు. – నాయుడుపేటలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, డాక్టర్‌ రామసుబ్బయ్య మద్దతు ప్రకటించారు. జీతం పెంచమని అడుగుతుంటే ‘చీరలు కొనిచ్చా.. జాకెట్లు కొనిచ్చా’ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో జగన్మోహన్‌రెడ్డి ఉండటానికి రూ.525 కోట్లు ఖర్చు పెట్టారని, స్మార్ట్‌ మీటర్ల కోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇదంతా ఎవరికోసమని హెచ్చరించారు. ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ, మేరి, ప్రమీల, సిఐటియు నాయకులు ఎస్‌.ముకుంద, మహేష్‌ పాల్గొన్నారు. – గూడూరులో అంగన్‌వాడీ కార్యకర్తలను రోడ్డు ఎక్కించిన ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కిందని, పోరాటంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రదర్శనగా టవర్‌క్లాక్‌ వద్దకు చేరుకుని రాస్తారోకో, మానవహారం నిర్వహిస్తూ కోలాటం ప్రదర్శించారు. తెలంగాణా కొత్త ప్రభుత్వం అంగన్‌వాడీలకు 18వేలు ఇస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని జగన్‌ ప్రభుత్వం గుర్తించాలన్నారు. నాయకులు ఎ.ఇంద్రావతి, జోగి శివకుమార్‌, బివి రమణయ్య పాల్గొన్నారు. – తిరుపతిలో ఏకాదశి పురస్కరించుని ‘కంటి తుడుపు జీవోలు వద్దు.. సమస్యలు పరిష్కరించాలి’ అంటూ నల్లరిబ్బన్లు కట్టుకుని దీక్ష కొనసాగించారు. వైకుంఠ ఏకాదశి పండుగ రోజూ అంగన్‌వాడీలో సమ్మె శిబిరంలోనే నిరసనలో ఉన్నారు. నాగరాజమ్మ, ఎల్లమ్మ,రాజేశ్వరి, గంగాదేవి, నాగరత్నలు దీక్ష చేపట్టారు. తమకు ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు తమను పస్తులతో ఉంచి జగన్‌ పుణ్యం మూట గట్టుకున్నారన్నారని ఎద్దేవా చేశారు. ప్రజానాట్యమండలి కన్వీనర్‌ రాజు బృందం దీక్షా శిబిరం వద్ద మద్దతు తెలియజేసి విప్లవగీతాలను ఆలపించారు. – వెంకటగిరిలో ప్రాజెక్టు కార్యదర్శి స్వరూపరాణి ఆధ్వర్యంలో నిరాహారదీక్ష బూనారు. యూనియన్‌ నాయకులు మంజుల, ప్రసన్న పాల్గొన్నారు. – సూళ్లూరుపేటలో సిపిఎం జిల్లాకార్యదర్శి వందవాసి నాగరాజు సంఘీభావం తెలిపారు.నాయకులు పద్మనాభయ్య, పి.మనోహర్‌, లక్ష్మయ్య, అంగన్‌వాడీ నాయకులు హైమావతి పాల్గొన్నారు.

➡️