‘సాగు’త్సాహం.’ రెట్టింపు’ముమ్మరంగా వరినాట్లుచురుగ్గా వ్యవసాయ పనులుకూలీలు దొరక్క ఇక్కట్లు

‘సాగు’త్సాహం.’ రెట్టింపు’ముమ్మరంగా వరినాట్లుచురుగ్గా వ్యవసాయ పనులుకూలీలు దొరక్క ఇక్కట్లుప్రజాశక్తి – రామచంద్రాపురం కరువు నేల పచ్చదనం పరుచుకుంటోంది. ఇటీవల మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో భూగర్భజలాలు విస్తారంగా ఉబికి రావడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు పొంగి పొర్లుతుండడంతో నీటి సౌకర్యం లేని పొలాల్లోనూ వరి నాట్లు వేసేందుకు రైతన్నలు సమాయత్తం అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరి సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. బియ్యం ధరలకు రెక్కలు రావడంతో కనీసం ఇంట్లో భోజనానికైనా వస్తుందన్న ఆశతో ఉన్నారు. అయితే వ్యవసాయ పనుల స్థాయిలో కూలీలు దొరక్కపోవడంతో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం మండలంలో ఎటుచూసినా పచ్చదనం పరచుకున్న పొలాల్లో కూలీలు వ్యవసాయ పనుల్లో మమేకమై కనిపిస్తున్నారు. ఇటీవల వర్షాలు కురిసి ఆగిపోవడంతో పంట పొలాలలో వర్షపు నీరు నిండిపోవడంతో రైతన్నలు వరినారు కోసం అడుసులు దున్ని వరి ధాన్యాలను చల్లి వరినారు సిద్ధం చేసుకున్నారు. అనంతరం పొలాన్ని అడుసు దున్నడం కోసం కాడెద్దులతో మడకల దున్ని, అడుసుతో చక్కగా గెనాలు ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు దొరక్క రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలంలో అడుసు బాగా కుల్లడం కోసం ఆకులు, పాడి ఎరువు వేసి, అనంతరం చెక్కతో చదును చేసి వరి పంటను సేంద్రీయ వ్యవసాయం ద్వారా వరి నాట్లు నాటేందుకు సన్నద్ధం చేస్తున్నారు. మండలంలో రైతన్నలు కొంతమంది వరి సాగును డ్రమ్‌ సీడర్‌ ద్వారా, వరి నారుతో మరి కొంతమంది వరినాట్లు వేస్తున్నారు. గత ఏడాది రబీ సీజన్లో 775 ఎకరాలు సాగు చేశారు. ఈ ఏడాది రబీ సీజన్లో 1300 ఎకరాలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గ్రామాలలో మహిళలు వరి నాట్లు నాటేటప్పుడు కష్టం తెలియకుండా ఉండేందుకు జానపద గేయాలు పాడుతూ…… ఉల్లాసంగా…… ఉత్సాహంగా నడుము వంచి వరి నాట్లు నాటుతున్నారు.

➡️