శ్రీకాళహస్తీశ్వరాలయంలో అతిథి గ్రహాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అతిథి గ్రహాలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అతిథి గ్రహాలుప్రజాశక్తి-శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం రాహు కేతు పూజలకు ప్రసిద్ధి కావడంతో రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతోంది. అయితే ఆలయంలో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది రాహుకేతువులను మించి వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరి వల్ల ఆలయానికి అపఖ్యాతి, నష్టం వస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతి గదులను కొందరు ఆలయాధికారులు తమ సొంత బస కోసం వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అది కూడా నెలో, రెండు నెలలో కాదు ఏకంగా ఏళ్ల తరబడి. దీంతో భక్తులకు బస అవస్థలు, ఆలయ అదాయానికి భారీగా గండి.లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇదేం పని..!! సద్యోముక్తి క్షేత్రంగా..రాహు-కేతు నిలయంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి ప్రతిరోజు 30 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. నాలుగు వేలకు పైగా రాహుకేతు పూజలు జరుగుతుంటాయి. వసతి గదుల సౌకర్యం మాత్రం చాలా తక్కువ. ఉన్న గదులను కూడా సక్రమంగా వినియోగించడం లేదు. నిర్వహణా లోపాల వల్ల కొన్ని గదులు అధ్వానంగా ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్న గదులను కొందరు రిజర్వు చేసుకోవడంతో ఆలయానికి వచ్చే భక్తులు అవస్థలు పడుతున్నారు. జ్ఞాన ప్రసూనాంబ సదన్‌ కింది భాగంలో ఉన్న 7 గదులను భక్తులకు అద్దెకు ఇవ్వడం లేదు. అంతేగాకుండా ఎనిమిదో నంబరు గదిని కూడా అద్దెకు ఇవ్వడం లేదు. గతంలో ఇఓగా పనిచేసి బదిలీ అయిన కె.వి సాగర్‌ బాబు 19 నెలల పాటు అతిథి గహంలో ఉండి వెళ్లారు. ప్రస్తుతం ఈఈ నూకరత్నం సుమారు 10 నెలలుగా 8వ నెంబర్‌ గదిలోనే ఉంటున్నారు. భక్తులకు అద్దెకు ఇస్తే ఆలయానికి ఆదాయం వస్తుంది. ఆలయానికి అధికారులుగా వస్తున్న వారు అతిథి గహాల్లో తిష్ట వేస్తున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం సంవత్సరాల తరబడి అతిథి గహాల్లో అధికారులు నివాసం ఉండడానికి వీల్లేదు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు ఆలయాధికారులు ఇలా భక్తుల కోసం నిర్మించిన వసతి గహాల్లో బస చేస్తే ఎలా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన అతిథి గహాలను అధికారులు నివాసాలుగా మార్చడం ఎంతవరకు సబబో వారికే తెలియాలి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అదీ కాకుండా స్థానికంగానూ నాయకత్వం మారింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని అతిథి గహాల్లో అధికారులు నివాసం ఉండకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

➡️