ఘనంగా గంగమ్మ జాతర : టీటీడీ ఛైర్మన్‌

ఘనంగా గంగమ్మ జాతర : టీటీడీ ఛైర్మన్‌

ఘనంగా గంగమ్మ జాతర : టీటీడీ ఛైర్మన్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: రాజకీయ విబేధాలు పక్కన బెట్టి మనమందరం గంగమ్మ జాతరను గొప్పగా నిర్వహించుకుందామని టీటీడీ ఛైర్మన్‌ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం స్థానికంగా 15 మండపాల్లో గంగమ్మ విగ్రహాలను ప్రతిష్టించి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడిగా గంగమ్మ జాతర చేసుకుందామని, సాక్షాత్తు తిరుమల నంబి, అనంతాళ్వార్ల అమత హస్తాలతో పునర్నిమితమైన దేవాలయం ఇది అని అన్నారు. భారతదేశంలో జాతర ఉత్సవాలు నిర్వహించే సంస్కతి తిరుపతి నుంచే ప్రారంభమైంది అని చెప్పారు.బైరాగి వేషాలతో అలరించిన చిన్నారులుమొన్నటి వరకూ ఎన్నికల ప్రచారాలతో మోతెక్కిన తిరుపతి నగర వీధులు.. ఇప్పటి నుంచి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. బుధవారం ఉదయం చిన్నారులు బైరాగి వేషంలో నగరంలో సందడి చేశారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి వచ్చి గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయం వద్ద బైరాగి వేషాలతో సందడిగా నెలకొంది. భక్తులు తమ శరీరానికి తెల్లటి రంగు పేస్ట్‌ (నామ్‌ కొమ్ము) పూసుకుని, ”రెల్ల కాయ” పండ్లతో చేసిన దండను ధరిస్తారు. భక్తులు తమ చేతులలో వేప ఆకులను పట్టుకుని వేపఆకులతో నడుముకు కట్టుకుంటారు. ప్రజలు కాలినడకన ఆలయానికి చేరుకుంటారు, అమ్మవారి దర్శనం తర్వాత ఆలయం వద్ద ఆ వేప ఆకులు, రెల్లకాయ మాలలను అక్కడ వదిలివేస్తారు. జాతర సందర్భంగా ఆలయ అధికారులు విస్తత ఏర్పాట్లు చేశారు. టీటీడీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, తుడా ఆరోగ్యశాఖతోపాటు విద్యుత్‌ శాఖ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.తిరుపతి ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నా.. ఆరణి శ్రీనివాసులు తిరుపతి ప్రశాంతంగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గంగమ్మ తల్లి దీవెనెలను ప్రతి ఒక్కరిపైనా మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఆరణి శ్రీనివాసులు తన జన్మదినం సందర్భంగా గంగమ్మ తల్లిని సతీసమేతంగా బుధవారం ఉదయం దర్శించకున్నారు. ఆలయ పూజారి ఆరణి దంపతుల పేరిట అర్చన చేసి దీవెనులు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కారణంగా జాతర ఆలస్యమైనా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తిరుపతి మహర్థశ మారాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బిజేపి నాయకులు కార్యకర్తులు మధ్యాహ్నం ఆరణి శ్రీనివాసులు ఇంటికి చేరి ఆయనకు శుభాంకాంక్షులు తెలిపారు. పలువురు నాయకులు భారీ కేకులు తెచ్చి ఆయన చేత కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం: కమిషనర్‌ అదితి సింగ్‌శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర జరిగే అన్ని రోజుల్లో తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని సౌకర్యాలను, ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అదితి సింగ్‌ తెలిపారు. నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులకు గంగమ్మ జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై తగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ శానిటేషన్‌ నిర్వహణ కోసం ఆలయ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల పారిశుధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టాలని, బ్లీచింగ్‌ చల్లించాలని, డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయించాలని, అదేవిధంగా మెడికల్‌ క్యాంప్‌, అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేయించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ యువ అన్వేష్‌ రెడ్డికి, అదేవిధంగా శానిటేషన్‌ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతిలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు తాగునీరు ఏర్పాట్లకు, చక్కటి నిర్వహణకు కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మోహన్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌ ప్రత్యేకచర్యలు చేపట్టాలన్నారు. ఆలయం వద్ద లైటింగ్‌ ఏర్పాటు చేయాలని, స్ట్రీట్‌ లైట్లు అన్ని వెలిగేలా చూడాలని ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు సుబ్బరామయ్య, నరేంద్రలను ఆదేశించారు. అలాగే ఆలయం దగ్గర ముందు జాగ్రత్తల కోసం అగ్నినిరోధక చర్యల కోసం ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ ఫైర్‌ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనాథ్‌ రెడ్డిలకు తగు సూచనలు జారీ చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఇబ్బందులు కల్గించే ఆక్రమణలను తొలగించాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యంలకు ఆదేశాలు జారీ చేశారు. జాతర ముగింపు రోజు 21వ తేది మంగళవారం ప్రత్యేక చర్యలు తీసుకొని అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని కమిషనర్‌ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ చరణ్‌తేజ్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ తిరుమాలిక మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️